బ్రిక్స్ సభ్యదేశాలకు ప్రధాని మోడీ హెచ్చరిక
నిబంధనలను పాటించడం కాదు.. మనమే రూపొందించాలని సూచన
స్టార్టప్ ఇన్నొవేషన్ ఫండ్ ఏర్పాటుకు ప్రతిపాదన
న్యూఢిల్లీ : కీలక ఖనిజాలను ఆయుధాలుగా మారిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతాయని ప్రధాని నరేంద్ర మోడీ బ్రిక్స్ సభ్యదేశాలను హెచ్చరించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకొని నిలబడే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ఆదివారం ప్రసంగిస్తూ ‘సాంకేతిక తను, కీలక ఖనిజాలను ఆయుధాలుగా మార్చడం మన పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో మేము అందరినీ కలుపుకొని వెళతాం’ అని చెప్పారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు నిరంతరం పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ అవి సాధారణ ప్రజల జీవితాలపై ప్రతికూ ల, విస్తృత ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.
సంక్షోభాలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కావడం లేదు
మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరాలకు అంతరాయాలు…ఇలా ఏ సంక్షోభం ఎదురైనా అది ఒకే ప్రాంతానికి పరిమితం కావడం లేదని ప్రధాని అన్నారు. ‘అందువల్లనే కష్టాలను తట్టుకొని నిలబడే సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాము. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటికి సిద్ధమవడం, తక్షణ చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటు వ్యాధుల నివారణ కోసం బ్రిక్స్‌లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుపై అంగీకారం కుదిరింది. హెచ్చరికల డేటాకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేశాము. బ్రిక్స్ సహకార వ్యవస్థ మన సరఫరాలను మరింత విశ్వసనీయంగా మారుస్తుంది’ అని ఆయన వివరించారు. ప్రపంచ సంక్షోభాల నివారణ కోసం నిర్ణయాలు తీసుకోవడంతో గ్లోబల్ సౌత్ దేశాలు వెనుకబడుతున్నాయని చెప్పారు. ఈ దేశాలు నిబంధనలను పాటించేవిగా ఉండకూడదని, వాటిని రూపొందించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు. అభివృద్ధి కోసం కృషి చేసే సమయంలో పర్యావరణానికి హాని కలిగించవద్దని మోడీ సూచించారు.
మానవాభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యత అవసరం
మానవాభివృద్ధి, పర్యావరణం మధ్య సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరముందని ప్రధాని నొక్కిచెప్పా రు. సుస్థిరతకు ఇదే పునాది అని,ఆ దిశగా భారత్ అనేక కార్యక్రమాల్లో పురోగతి సాధించిందని తెలిపారు. స్మార్ట్ గ్రిడ్లు, ఇంధన నిల్వకోసం బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించామన్నారు. బ్రిక్స్‌కు అధ్యక్షత వహిం చి ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత,స్థితిస్థాపకత అనే నాలుగంశాలపై తమ ప్రయత్నాలను కేంద్రీకరించామని, సభ్యదేశాల సహకారం, మద్దతుతో ఉమ్మడి దృక్పథాన్ని అందరికీ ప్రయోజనకరమైన సహకారంగా మార్చగలగడం తనకు సంతోషాన్ని కలిగించిందని మోడీ చెప్పారు.
సహకారంలో అందరినీ భాగస్వాములను చేయాలి
ఆవిష్కరణల విభాగంలో బ్రిక్స్ ఇంక్యుబేటర్ వ్యవస్థ సభ్యదేశాల స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లను అనుసంధానిస్తుందని మోడీ తెలిపారు. వినూత్నమైన, విస్తరించదగిన పరిష్కారాలను ప్రోత్సహించడానికి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నొవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. డిజిటల్ వ్యవసాయంపై రైతులకు బ్రిక్స్ నెట్‌వర్క్ నూతన అవకాశాలను సృష్టిస్తుందని, దీని ద్వారా ఏఐ, జియోస్పేషియల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా అనుసంధానించడం జరుగుతుందని మోడీ వివరించారు. స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ వేదికను భారత్ ఉపయోగించుకున్నదని ఆయన అన్నారు. బ్రిక్స్ సహకారం కేవలం ప్రభుత్వాలకే పరిమితం కాకూడదని అంటూ పారిశ్రామికవేత్తలు, రైతులు, పరిశోధకులు, మహిళలు, యువతతో పాటు సాధారణ పౌరులనూ భాగస్వాములను చేయాలని అభిప్రాయపడ్డారు. ‘నైపుణ్యాలు, శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని, సామాజిక భద్రతను, సామర్ధ్య నిర్మాణాన్ని ప్రోత్సహించామని, చిన్న పారిశ్రామికవేత్తల కోసం బ్రిక్స్ ఎంఎస్‌ఎంఈ సహకార పోర్టల్‌ను ప్రారంభించామని ప్రధాని తెలిపారు.



