Monday, September 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపదవి అలంకారమే..ప్రజల కోసం పని చేస్తా

పదవి అలంకారమే..ప్రజల కోసం పని చేస్తా

- Advertisement -

బర్తరఫ్ చేసినందుకు కాదు.. అకారణంగా తొలగించినందుకే బాధ
కాంగ్రెస్ లోనే కొనసాగుతాం..తూర్పులో మళ్ళీ నేనే గెలుస్తా
ఎమ్మెల్సీ బస్వరాజ్ పై తీవ్ర వ్యాఖ్యలు
కొండా మురళికి చైర్మెన్ పదవి వచ్చే అవకాశం : ​మాజీ మంత్రి కొండా సురేఖ
రాహుల్‌‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం
24 డివిజన్‌లలో కార్పొరేటర్లను గెలిపించుకుంటాం : కొండా మురళీ

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినందుకు బాధ లేదని, అకారణంగా తొలగించినందుకే బాధగా ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదివారం వరంగల్ బస్టాండ్ సమీపంలోని ఎంకే నాయుడు హోటల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం మాజీ కార్పొరేటర్ కత్తెరశాల వేణుగోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కొండా సురేఖతో పాటు ఆమె భర్త మురళి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ మీసాల ప్రకాష్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ నవీన్ ఎప్పుడూ స్థానికంగా ఉండాలనేవాడని, ఇప్పుడు అతని కోరిక తీరిందని, ప్రజల మధ్య ఉండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. మేం నమ్మిన వైఎస్ కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశామన్నారు. కొందరు వార్డు మెంబర్ పదవికి కూడా రాజీనామా చేయడం లేదన్నారు. ఎప్పుడూ అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలో చేరేవారమన్నారు. గతంలో కొందరు గుంట నక్కలు మాకు టికెట్ దక్కకుండా చేశాయన్నారు. కాంగ్రెస్ లో టికెట్‌ ‌రాకపోతే కేసీఆర్ పిలిచి మంత్రిని ఓడించడానికి వరంగల్ తూర్పులో పోటీ చేయాలని చెప్పారన్నారు. అందుకే పరకాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి యాభై వేల పైచిలుకు మెజారిటీతో గెలిచానని గుర్తుచేశారు.

వరంగల్ తూర్పులో మేం గెలిచినందుకే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. కొండా మురళీ ఉన్నారనే ధైర్యంతో ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఆయన తమ్ముడు, కొడుకు భూకబ్జాలు చేశారని, షాపుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ గా గెలవలేనోడు నా రాజీనామా కోరుతున్నాడని ఎద్దేవా చేశారు. 32 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎంపీపీ నుంచి మంత్రి వరకు ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొని ఎదిగానన్నారు. బరిలో నిలిచిన ప్రతి చోట మురళీ వెనుక ఉండి నడిపించారన్నారు. ఇప్పుడు అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయని, ఏ సమయంలో ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదన్నారు. కొండా దంపతులు కాంగ్రెస్ ను వీడి వేరే పార్టీల్లో చేరుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని వాటిని నమ్మొద్దని పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. మళ్లీ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానన్నారు. డీలిమిటేషన్ జరిగితే తప్ప ఆమెనే పోటీ చేస్తానన్నారు. రాహుల్ లక్ష్యం బీసీలను అభివృద్ధి చేయాలనేనని తెలిపారు. కొండా మురళీకి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మెన్ పదవి వచ్చే అవకాశం ఉందని సురేఖ సూచనప్రాయంగా తెలిపారు. పరకాల నియోజక వర్గంలోని తండాల్లో రూ. 7.50 కోట్లతో రోడ్ల నిర్మాణానికి జీఓ తెచ్చానన్నారు.

రాహుల్ ను ప్రధానిని చేయడమే లక్ష్యం..: కొండా మురళీ
రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ, సురేఖ భర్త కొండా మురళీ తెలిపారు. పదవులు వస్తాయి, పోతాయని, కానీ, మాట మీద నిలబడాలన్నారు. 24 డివిజన్ లలో కార్పొరేటర్లను గెలిపించుకుంటామన్నారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు రాజీనామా చేస్తున్నావని స్వామి గౌడ్ అడిగారని, నచ్చకపోవడం వల్లే అని చెప్పి రాజీనామా చేశానన్నారు. నా మాట, సురేఖ మాట ఒక్కటే ఉంటుందని, నా బిడ్డ మాట మాత్రం వేరన్నారు. ఎక్కడన్నా కొండా మురళీ భూ కబ్జాలు చేశాడని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. కార్యకర్తలే మా బలం, మా ఊపిరి అన్నారు.

కొండా సురేఖకు మంత్రి పదవి ఇవ్వాలి : వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు
కొండా సురేఖకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వాలని వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. బీసీ మహిళా నేతను బర్తరఫ్ చేయడం సరైంది కాదన్నారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మీసాల ప్రకాష్, నవీన్ రాజ్, మాజీ కార్పొరేటర్లు చింతాకుల అనిల్, కేడెల పద్మ, దామోదర్ యాదవ్, భోగి సువర్ణ ప్రవీణ్, బస్వరాజ్ కుమార్, బత్తిని వసుంధర, నాగపురి కల్పన, వీరగోని రాజ్ కుమార్, ముజీబ్, అక్తర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -