Monday, September 14, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో మురికివాడలకు అడ్డు తెరలు

ఢిల్లీలో మురికివాడలకు అడ్డు తెరలు

- Advertisement -

బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో ప్రపంచ నేతల కంట పడకుండా ఏర్పాట్లు
బీజేపీ ప్రభుత్వ వైఖరిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
పేదరికాన్ని దాచే పాలన ఎందుకు? :ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు

​నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో వాస్తవాలు ప్రపంచ నేతల కంటపడకుండా మురికివాడల చుట్టూ డబుల్‌ ఇంజన్‌ ‌సర్కారు అడ్డు తెరలను ఏర్పాటు చేసింది. బ్రిక్స్‌ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దేశ రాజధానిలోని పేదల జీవన పరిస్థితులు అంతర్జాతీయ అతిథులకు కనిపించకుండా తెరలు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరాన్ని అందంగా చూపించేందుకు పేదల బతుకులను దాచడం అభివృద్ధి కాదని విమర్శిస్తున్నాయి.

అభివృద్ధి అంటే దాచడమా?
ఢిల్లీలో పేదలు నివసించే ప్రాంతాల్లో సరైన గృహాలు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వం.. ప్రపంచ నేతల పర్యటనల సందర్భంగా వాటిని తెరల వెనుక దాచడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పేదరికాన్ని కప్పిపుచ్చడం ద్వారా పేదరికం పోదని సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ తదితర పార్టీలు స్పష్టం చేశాయి. ప్రపంచ నేతల కంటపడకుండా ఢిల్లీలోని మురికివాడలను తెరలతో కప్పివేయడం బీజేపీ ప్రభుత్వ దివాళాకోరు విధానాలకు నిదర్శనమని సీపీఐ(ఎం) విమర్శించింది. పేదల సమస్యలను పరిష్కరించకుండా వారి నివాసాలను దాచిపెట్టడంతో దేశ ప్రతిష్టను పెంచలేరని పేర్కొంది. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పే పాలకులు.. పేదల బతుకులను ప్రపంచానికి కనిపించకుండా చేయడం దారుణమని పేర్కొంది. అంతర్జాతీయ సదస్సుల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పేదలకు గృహాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేసింది. పేదల నివాస ప్రాంతాలను తెరలతో కప్పివేయడం అభివృద్ధి కాదని, ఇది పేదల పట్ల పాలకుల వివక్షను బయటపెడుతోందని తెలిపింది. దేశ రాజధానిలో పేదలు గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. మురికివాడలను కప్పివేసే చర్యలను నిలిపివేసి, అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేసింది.

తెరల మాటున పేదల జీవితం
బీజేపీ ప్రభుత్వానికి పేదల సమస్యల పరిష్కారం కంటే వాటిని ప్రపంచం కంటపడకుండా చేయడంపైనే శ్రద్ధ ఉందని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా విమర్శించారు. ఢిల్లీ ప్రజల వాస్తవ పరిస్థితులను దాచడం సిగ్గుచేటని ఆమ్‌ ఆద్మీ పార్టీ విమర్శించింది. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను పెంచాలంటే పేదల సమస్యలను పరిష్కరించాలి తప్ప.. వారిని తెరల వెనుక దాచకూడదని పేర్కొంది.

ఆంక్షలతో సామాన్యుల ఇక్కట్లు
వీవీఐపీల రాకతో ఢిల్లీలో పలు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. 35 రోడ్లపై దాదాపు 24 గంటల పాటు ఆంక్షలు విధించి, 22 పాయింట్ల వద్ద మళ్లింపులను ఏర్పాటు చేశారు. దీంతో న్యూఢిల్లీ , సెంట్రల్ ఢిల్లీ జిల్లాల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటో రిక్షాలు, ఈ-రిక్షాలు, డెలివరీ, రోజువారీ కార్మికుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. 19 ఏండ్ల గిగ్‌‌వర్కర్‌ పవన్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా తాను రెండు రోజుల సంపాదనను కోల్పోయానని తెలిపాడు. ఆటో రిక్షాలు, ఈ-రిక్షాల డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోయామని చెప్పారు. సామాన్య ప్రజల రోడ్డు ప్రయాణం కష్టంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -