పాత వారికి పార్టీ పదవులిద్దాం
కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
డిసెంబరులో భర్తీ చేసేందుకు సమాలోచనలు
జీహెచ్ఎంసీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలే లక్ష్యం
బి.వి.యన్.పద్మరాజు
కార్పొరేషన్ పదవుల్లో మొన్నటిదాకా కొనసాగిన వారి స్థానంలో కొత్త వారికి ఆయా పదవులను కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం.. సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు సూచించింది. ఇప్పటిదాకా చైర్మెన్లు, సభ్యులుగా కొనసాగిన వారికి మళ్లీ పదవులు అప్పగిస్తే… పదవులు ఆశిస్తున్న వారు, వాటికోసం ఎన్నాండ్ల నుంచో ఎదురు చూస్తున్న యువ నాయకులు నిరుత్సాహానికి గురవుతారని హైకమాండ్ సూచించింది. రెండూ మూడు నెలల్లో నిర్వహించబోతున్న హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎమ్సీ), ఖమ్మం, కరీంనగర్ కార్పొరేషన్‌తోపాటు మరికొన్ని మున్సిపాల్టీల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అందర్నీ సమన్వయం చేసుకుని ముందుకు పోవటానికి, ఎవరూ వ్యతిరేకం కాకుండా చూసుకోవటానికి ఈ వ్యూహం పనికొస్తుందని అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. ఆ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌తో సమాలోచనలు పూర్తి చేసుకుని, కసరత్తలు షురూ చేయాలంటూ సీఎం, పీసీసీ చీఫ్‌కు సూచించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో 2023 డిసెంబరులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి విదితమే. ఆ తర్వాత 2024 మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అవి ముగిసిన తర్వాత జులైలో మొత్తం 32 కార్పొరేషన్లకు చైర్మెన్లను, సభ్యులను నియమించారు. ఇవిగాక మరో 60 కార్పొరేషన్లకు పాలక మండళ్లను నియమించాల్సి ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయలేదు. కొంతమందికి పదవులిచ్చి, కొంత మందికి ఇవ్వకపోతే… లేనిపోని సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే వాటి జోలికి పోలేదని అప్పట్లో గాంధీ భవన్ వర్గాలు వివరణిచ్చాయి. ఈ క్రమంలో భర్తీ చేసిన 32 కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీ కాలం (రెండేండ్లు) ఈ యేడాది జులైతో ముగిసింది. ఆయా పదవుల్లో అప్పటిదాకా కొనసాగిన నేతలు… మరోసారి తమకు అవకాశం కల్పించాలంటూ అధిష్టానం నుంచి మొదలుకుని పీసీసీ చీఫ్ వరకూ అందరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా రెండోసారి ఆశలు పెట్టుకున్న వారిలో నాగంగారి ప్రీతమ్ (ఎస్సీ కార్పొరేషన్), పటేల్ రమేశ్ రెడ్డి (టూరిజం కార్పొరేషన్), తూర్పు నిర్మలా జగ్గారెడ్డి (టీ.ఎస్.ఐ.ఐ.సీ), మెట్టు సాయి కుమార్ (ఫిషరీష్ కార్పొరేషన్), ఈరావత్రి అనిల్ (మైనింగ్ కార్పొరేషన్), శివసేనా రెడ్డి (టీఎస్ శాట్స్), నూతి శ్రీకాంత్ గౌడ్ (బీసీ కార్పొరేషన్), బెల్లయ్య నాయక్ (ఎస్టీ కార్పొరేషన్) తదితరులున్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరికీ రెండోసారి పదవులను కట్టబెట్టే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానానికి లేదని తెలిసింది.
అవసరమైతే వారికి పార్టీలోనో, ప్రభుత్వంలోని ఇతర పదవులను ఇచ్చి సంతృప్తి పరచాలనే యోచనలో ఆ పార్టీ పెద్దలున్నట్టు సమాచారం. వీరి స్థానంలో ఎలాంటి పదవులూ ఆశించకుండా అనునిత్యం పార్టీనే అంటిపెట్టుకుని తిరుగుతున్న అధికార ప్రతినిధులు లింగం యాదవ్, రవిచంద్ర లాంటి యువ నాయకులను ప్రోత్సహించాలంటూ ఇటీవల నిర్వహించిన అంతర్గత సమావేశాల్లో నిర్ణయించారని ఒక సీనియర్ నాయకుడు వెల్లడించారు. కాగా కార్పొరేషన్లు కాకుండా విద్యా కమిషన్, రైతు కమిషన్‌కు సంబంధించిన పాలక మండళ్ల పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పొడిగించే అవకాశాలున్నాయి. విద్యా కమిషన్‌కు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి చైర్మెన్‌గా వ్యవహరించిన సంగతి విదితమే. కాగా ఆయన కొద్ది నెలల క్రితం తన పదవికి రాజీనామా చేశారు. ఆ కమిషన్‌లో సభ్యులుగా ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేశ్, జ్యోత్న్స శివారెడ్డి సభ్యులుగా వ్యవహ రించారు. రైతు కమిషన్‌కు చైర్మెన్‌గా కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి వ్యవహరించారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్‌కు చైర్మెన్‌గా కొత్తవారిని నియమించి, పాత సభ్యుల పదవీ కాలాన్ని త్వరలోనే పొడిగించనున్నారు. రైతు కమిషన్ చైర్మెన్‌ను, సభ్యులను మరో రెండేండ్లపాటు కొనసాగించనున్నారు. సంబంధిత ఉత్తర్వులు వచ్చే వారం విడుదల కానున్నాయి. మరోవైపు ఇప్పటికే మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య చైర్మెన్‌గా ఉన్న స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పాలక మండలి పదవీ కాలాన్ని రెండేండ్లపాటు పొడిగించారు. కాగా అన్నీ సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి కార్పొరేషన్ పదవుల్లో కొత్తవారు కొలువుదీరనున్నారని ఆశావహుల్లో ఒకరు అభిప్రాయపడ్డారు.



