Monday, September 14, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఐక్య పోరాటాలే ఏచూరికి నిజమైన నివాళి

ఐక్య పోరాటాలే ఏచూరికి నిజమైన నివాళి

- Advertisement -

​డిజిటల్‌ వేదికలతో ప్రజా చైతన్యం
​డిజిటల్‌ వేదికలతో ప్రజా చైతన్యంప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కుల
పరిరక్షణకు నూతన పోరాట వేదికలు నిర్మించాలి
న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ
ఏచూరి స్ఫూర్తితో ​లౌకిక, సమాఖ్య సూత్రాలను
కాపాడుకుందాం : తమ్మినేని
ఖమ్మం, సూర్యాపేటలో సీతారాం ఏచూరి 2వ వర్థంతి సభ

నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/సూర్యాపేట
ఐక్య పోరాటాలే సీతారాం ఏచూరికి అర్పించే నిజమైన నివాళి అని న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నూతన పోరాట వేదికలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం సీపీఐ(ఎం) పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యులు సీతారాం ఏచూరి ద్వితీయ వర్థంతి సందర్భంగా ఖమ్మం, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సెమినార్లు నిర్వహించారు. ముందుగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రబీర్‌ పుర్కాయస్థ మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ రాజకీయాల వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన ఏచూరి, అనంతరం పార్లమెంటరీ రాజకీయాల్లోనూ ప్రజా సమస్యలు, రాజ్యాంగ విలువలు, లౌకికవాదం, సామాజిక న్యాయం కోసం బలమైన గొంతుకగా నిలిచారని తెలిపారు. భిన్నాభిప్రాయాలను గౌరవించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజల హక్కుల కోసం నిలబడటం వంటి ప్రజాస్వామ్య విలువలను ఏచూరి తన రాజకీయ జీవితంలో ఆచరించారని చెప్పారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై మాట్లాడటం, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులని తెలిపారు. సీతారాం ఏచూరి ఆశయాలను, ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

ఓటు హక్కు కాపాడేందుకు ఉద్యమం
ఫాసిస్టు ధోరణులతో పాలన సాగించే పాలకులు శాశ్వతంగా అధికారంలో కొనసాగేందుకు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ విమర్శించారు. గతంలో ఎన్నికల సమయంలో పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ వంటి ఘటనలు జరిగేవని, ప్రస్తుతం ఓటర్ల జాబితాలను తారుమారు చేసే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు జాబితాల నుంచి తొలగిపోతున్నారని తెలిపారు. తమ ఓట్లు తొలగించబడ్డాయనే విషయం కూడా సామాన్యులకు తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికార, ధనబలంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చారు. బూత్‌ స్థాయి నుంచి ప్రజలను చైతన్యపరిచి వారి ఓటు హక్కును కాపాడేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో స్వతంత్ర మీడియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దేశచరిత్రను, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగిన పోరాటాలను అధ్యయనం చేసి ప్రజా సమస్యలపై చైతన్యవంతమైన పాత్ర పోషించాలని కోరారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం కార్మికులు,రైతులు,విద్యార్థులు, యు వత, మేధావులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య వాదులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

​డిజిటల్‌ వేదికలతో ప్రజా చైతన్యం
ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్‌ కేవలం సమాచార మార్పిడి సాధనం మాత్రమే కాదని, వ్యక్తుల భావప్రకటన, స్వేచ్ఛ, జీవన విధానంలో అంతర్భాగంగా మారిందని ప్రబీర్‌ అన్నారు. జంతర్‌మంతర్‌ వద్ద జరుగుతున్న జెన్‌-జీ నిరసనల నేపథ్యంలో డిజిటల్‌ వేదికల ప్రాధాన్యతను వివరించారు. మొబైల్‌ ఫోన్లు, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సమాన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఏకమవుతున్నారని, తమ అభిప్రాయాలు, సంతోషాలు, బాధలు, నిరసనలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. హాస్యం, వ్యంగ్య చిత్రాలు, సందేశాల ద్వారా నిరంకుశ విధానాలను అవలంబించే ప్రభుత్వాలు, నాయకులను ప్రశ్నించే శక్తిని డిజిటల్‌ సాధనాలు సామాన్యులకు అందించాయని అన్నారు. పరీక్షల పేపర్‌ లీకేజీలతో యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, ఏండ్ల తరబడి కోచింగ్‌ కోసం విద్యార్థులు, వారి కుటుంబాలు చేస్తున్న శ్రమ, ఆర్థిక భారం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. పరీక్షల రద్దు, వాయిదాలతో విద్యార్థుల భవిష్యత్తు మరింత అనిశ్చితంగా మారుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు యువత డిజిటల్‌ వేదికలను ప్రధాన సాధనంగా ఉపయోగించుకుం టోందని తెలిపారు.

​లౌకిక, సమాఖ్య సూత్రాలను కాపాడటమే నిజమైన నివాళి : తమ్మినేని
లౌకిక, సమాఖ్య సూత్రాలను కాపాడటమే సీతారాం ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల్లో ఓట్లు వేసి గెలవడం మాత్రమే కాదని, రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, సమాఖ్య స్ఫూర్తిని కాపాడు కోవడమేనని తెలిపారు. కామ్రేడ్‌ సుందరయ్య తర్వాత తెలుగు నేలపై అంతటి ప్రజాదరణ పొందిన కమ్యూనిస్టు నాయకుడు సీతారాం ఏచూరి అని కొనియాడారు. జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇంది రాగాంధీ ఎదుట ధైర్యంగా నిలబడి విద్యార్థుల డిమాండ్‌‌లను వినిపించారని గుర్తుచేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాల తరఫున ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి లౌకికవాదం, సమాఖ్యవాదం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం అనే నాలుగు కీలక సూత్రాలు అమలు కావాలని తెలిపారు. కేంద్రంలో అధికార కేంద్రీకరణకు బదులుగా రాష్ట్రాలు, పంచాయతీలకు నిధులు, అధికారాలను వికేంద్రీకరించాలని అన్నారు.

‘డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌’ పేరుతో రాష్ట్రాల హక్కులను భంగ పరచడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ హెచ్చరించినట్టు ఆర్థిక సమానత్వం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదని, ప్రస్తుతం కార్పొరేట్ల దోపిడీ పెరిగిపోయి ఓటును డబ్బుతో కొనుగోలు చేసే పరిస్థితి రావడం ఆందోళనకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, ప్రముఖ విశ్లేషకులు కొండూరు వీరయ్య, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవి, ఖమ్మం జిల్లా నాయకులు సరళ, పొన్నం వెంకటేశ్వర్లు, డివిజన్‌ కార్యదర్శి విక్రమ్‌, జిల్లా నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టి పెల్లిసైదులు, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -