Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువే భవిష్యత్తుకు మార్గం – పేదరికం అడ్డంకి కాదు: కలెక్టర్

చదువే భవిష్యత్తుకు మార్గం – పేదరికం అడ్డంకి కాదు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
చదువుకు పేదరికం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాదని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం కాటారం మండలం మేడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా నాల్గవ రోజు నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 20 నుండి 26 వరకు జరుగుతున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశమై ప్రగతి నివేదికలను పంపిణీ చేశారు.

కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు కలిసి సంక్షేమ వారోత్సవాల ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రగతి నివేదికలను కలెక్టర్ స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని పట్టుదలతో, క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ విద్యాలయాలు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారికి నిరంతర ప్రోత్సాహం అందించాలని కోరారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూఓ నాగసాగర్, ఎంపిడిఓ బాబు, సర్పంచ్ పవిత్ర, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -