నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు విస్తృతంగా పాల్గొన్నారు. పాఠశాల చివరి పనిదినం సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో, ప్రస్తుత విద్యాసంవత్సరంలో చేపట్టిన వివిధ విద్యా, సహపాఠ్య కార్యక్రమాలను వివరించారు. పాఠశాల మౌలిక వసతులు, దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు.
వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సెల్ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన అవసరం, పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం 21 వస్తువులతో కూడిన పాఠశాల కిట్ అందించనున్నట్లు, అలాగే పోషక విలువలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. అనంతరం విద్యార్థుల ప్రగతి నివేదికలను వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



