Wednesday, September 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్..

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘మహారాజ’ అంతర్జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. 2024లో విడుదలై ఘన విజయం అందుకున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారు. ఓ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం తమను సంప్రదించినట్టు నిర్మాత సుధన్ సుందరం స్వయంగా ధ్రువీకరించారు.

ఈ సినిమా చైనాలో విశేషంగా ఆకట్టుకుని, బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.91.65 కోట్లు వసూలు చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ మంచి ఆదరణ లభించడంతో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే రీమేక్ కోసం చర్చలు జరిగాయని నిర్మాత తెలిపారు.

ఈ హాలీవుడ్ ప్రాజెక్టును ఓ ఏ-లిస్ట్ స్టార్‌తో తెరకెక్కించేందుకు ఏజెన్సీ ప్రయత్నాలు చేస్తోందని, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో కథానాయకుడి పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ మాథ్యూ మెకానహే పేరు వినిపిస్తోంది. అయితే, నటీనటులు, స్టూడియో వంటి వివరాలను సంబంధిత ఏజెన్సీనే అధికారికంగా ప్రకటిస్తుందని సుధన్ సుందరం స్పష్టం చేశారు.

నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ చిత్రంలో, తన ఇంట్లో ‘లక్ష్మి’ అనే డస్ట్‌బిన్ కనబడటం లేదని ఓ బార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత ఊహించని మలుపులతో కథనం సాగుతుంది.

ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించగా, సేతుపతి కుమార్తెగా నటించిన సంచన నమిదాస్‌కు ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు లభించడం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -