నవతెలంగాణ – రాయపోల్
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉంది. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమై ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. రాయపోల్ మండల వ్యాప్తంగా గురువారం ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామపంచాయతీలు, ఆయా పార్టీల కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు.
ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ప్రజల ఆకాంక్షలు, హక్కులు, సంక్షేమమే పాలనకు కేంద్రబిందువుగా ఉండాలనే భావనను ప్రజా పాలన దినోత్సవం చాటిచెబుతోంది. చారిత్రక పోరాటాల్లో ప్రాణత్యాగం చేసిన యోధుల సేవలను స్మరించుకుంటూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసిల్దార్ కృష్ణమోహన్, ఎస్ఐ కే.మానస, వయా గ్రామాల సర్పంచులు ఉపాధ్యాయులు అధికారులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



