సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ-వనపర్తి
సెప్టెంబర్ 17న నిజాం రాజ్యం భారత దేశంలో విలీనం కావడానికి వీర తెలంగాణ సాయుధ పోరాటమే కారణమని, ఈ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని రాజకీయ పార్టీలు విమోచన దినమని అధికారికంగా సభలు పెట్టడం సిగ్గుచేటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు అన్నారు. సెప్టెంబరు 17న సీపీఐ(ఎం) వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్, కమాన్ చౌరస్తా, శంకర్ గంజి, జిల్లా ఆస్పత్రి రోడ్డు మీదుగా రాజీవ్ చౌక్ వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు ప్రసంగిస్తూ 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజ్యం భారత దేశంలో విలీనం కావడానికి వీర తెలంగాణ సాయుధ పోరాటమే కారణమన్నారు.
ఏమాత్రం పోరాటంతో సంబంధం లేని ఆర్ఎస్ఎస్, బిజెపిలు హిందూ ముస్లింల కొట్లాటగా చిత్రీకరరించి, విమోచన దినమని అధికారికంగా సభలు జరపడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. హిందూ ముస్లింల కొట్లాట అని ఓట్లు దండుకోవడానికి బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. యోధుల త్యాగాలను తలుచుకుందామని, వక్రీకరణను తిప్పి కొడదామని పిలుపునిచ్చారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948 సెప్టెంబర్ 17న నిజాం రాజ్యం భారత్లో విలీనం అయిందని అన్నారు. 1946 నుండి 1951 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నీ బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతానే పేదలు బంధు కులు బట్టి నిజాం రజాకార్లకు, నెహ్రూ సైన్యానికి ఎదురొడ్డి పోరాడారని అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వల్ల నిజాం రాజ్యం కమ్యూనిస్టుల వషమవుతుందని గమనించిన నెహ్రూ, సైన్యాన్ని పంపి భారతదేశంలో నిజాం రాజ్యాన్ని 1948 సెప్టెంబర్ 17న విలీనం చేశారు.
వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులు రైతులు, కమ్యూనిస్టులు 1500 మంది మరణించారని, 1948 సెప్టెంబర్ 17న భారత్లో నిజాం రాజ్యం విలీనమైనాక పోరాడి సాధించుకున్న 10 లక్షల ఎకరాల భూములను నిలుపుకునేందుకు,పెట్టిన అక్రమ కేసులను తొలగించుకునేందుకు పోరాటం కొనసాగిందని, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ సైన్యం 3000 గ్రామాల నుండి పారిపోయిన హిందూ భూస్వాములు, దొరలు, జాగిర్దారులు, జమీందారులు, పటేళ్లు, పట్వారిలు మళ్లీ ఖద్దరు టోపీలు పెట్టుకుని కాంగ్రెస్ నాయకులుగా నిజాం రాజ్యం పాలనలో తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి మళ్లీ పీడన కొనసాగించేందుకు ప్రయత్నిస్తే దానికి ఎదురొడ్డి నిలబడ్డ పోరాటమని వివరించారు. 1948 నుండి 1951 వరకు నెహ్రూ సైన్యం ద్వారా 2500 మంది కమ్యూనిస్టులు రైతులు వీరమరణం పొందారని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ కు ఎలాంటి ఇసుమంతైన పాత్ర లేకుండా నిజాం ముస్లిం కాబట్టి హిందువులు పోరాడి విమోచన చెందారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, హిందువులు, ముస్లింలు పేదలందరూ ముస్లిం రాజుకు వ్యతిరేకంగా రజాకార్లకు వ్యతిరేకంగా హిందూ భూస్వాములు, దొరలు, జాగిర్దారులు, దేశ్ముకులు, పట్వారిలు, పటేళ్లకు వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు కలిసి చేసిన పోరాటం అని తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
హిందూ ముస్లింల కొట్లాటగా ప్రచారం చేసి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించటం సిగ్గుచేటని కమ్యూనిస్టుల పోరాటాన్ని కి బిజెపి విమోచన పేరుతో రావడం ఎంత వరకు సరైంది అని అన్నారు. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా నిజాం రాజుకు వ్యతిరేకంగా నెహ్రూ సైన్యానికి వ్యతిరేకంగా ప్రాణాలు వడ్డీ పోరాడిన నాయకులను తల్చుకుందామని నేటికి నాటి పోరాటయోధుల ఆశయాలు అమలు కాలేదని దున్నేవారికి భూమి పంపకం జరగలేదని భూ పంపిణీ కోసం ఉద్యమాలు నిర్మించేందుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వర ఆచారి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు సీపీఐ(ఎం) కౌన్సిలర్ గంధం మదన్, సీపీఐ(ఎం) నాయకులు డి కురుమయ్య, జి బాలస్వామి, జి గట్టయ్య, బీసన్న నందిమల్ల రాములు, బంకలి కురుమయ్య, జి మహేష్, జి రత్నయ్య, దేవరాజు, జి భాస్కర్, వీరేందర్ మద్దిలేటి, రేమోద్దుల మన్యం, గోవిందు తదితరులు పాల్గొన్నారు.



