– పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించాలి
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్
నవతెలంగాణ – అశ్వారావుపేట
యూపీఐ లావాదేవీలపై పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకుని సామాన్యులపై అదనపు ఆర్థిక భారం మోపొద్దని సీఐటీయూ డిమాండ్ చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం అన్యాయమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. శనివారం రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సీఐటీయూ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ లావాదేవీలకు యూపీఐ పై ఆధారపడుతున్నారని అర్జున్ తెలిపారు. ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, అసంఘటిత కార్మికుల జీవితాల్లో యూపీఐ చెల్లింపులు నిత్యావసరంగా మారాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రజా వినియోగ వ్యవస్థపై చార్జీలు విధించడం వల్ల చిన్న మొత్తాల లావాదేవీలు చేసే వారిపైనా అదనపు భారం పడుతుందని అన్నారు.
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం యూపీఐ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే వ్యవస్థపై చార్జీలకు తలుపులు తెరవడం సరికాదని విమర్శించారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలంటే వాటిని ప్రజలకు ఉచితంగా, అందుబాటులో ఉండేలా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెంచిన యూపీఐ చార్జీల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురారి రఘు, విక్రమ్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.



