-అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుడుం స్వామి
నవతెలంగాణ – రాయపోల్
ప్రజాయుద్ధభేరి, ప్రజా కళాకారిణి విమలక్క పాటల ప్రస్థానం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఆర్టీసీ కళ్యాణ మండపం హైదరాబాద్‌లో నిర్వహించనున్న అరుణోదయ ప్రజా కళాజాతరను జయప్రదం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుడుం స్వామి అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో అరుణోదయ ప్రజా కళాజాతర కరపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుడుం స్వామి మాట్లాడుతూ ప్రజల సమస్యలు, సామాజిక చైతన్యం, మహిళల చైతన్యం, హక్కుల కోసం పాటను ఆయుధంగా మలచడంలో విమలక్క సాగించిన కళా ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు.
అలాగే తెలంగాణ ఉద్యమంలో గ్రామ గ్రామాన తిరుగుతూ తన మాట పాట ఆటలతో ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొనేలా చేయడంలో విమలక్క పాత్ర ఎంతో క్రియాశీలకంగా ఉందన్నారు. బహుజన బతుకమ్మ పేరుతో ఊరురా తిరుగుతూ బతుకమ్మ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ, కొన్ని గ్రామాలలో దళిత మహిళలు బతుకమ్మలు పండగలో పాల్గొనకుండా కుల వివక్షతకు గురైతే వారికి కూడా కులవర్గ పోరాటాలు లేకుండా తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు బతుకమ్మ వేడుకలలో పాల్గొనాలని వారిని చైతన్యం చేస్తున్నారు. విమలక్క జీవితం మొత్తం ప్రజా ఉద్యమాలు బడుగు బలహీన, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.ప్రజా కళా జాతరలో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గూని నందు, మాసాన్ పల్లి ఎమోజి, గూని కుమార్, తిప్పారం యాదగిరి, దయ్యాల కరుణాకర్, కూచిగారి నరేష్, మాసాన్ పల్లి బాలయ్య, జోగు శ్రీకాంత్,మాసాన్ పల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.



