ఇన్నేళ్లూ ఏం చేశావు?

ఇన్నేళ్లూ ఏం చేశావు?– ఎన్నికల వేళ గుర్తొచ్చామా?
– బీజేపీ ఎంపీని అడ్డుకున్న దళితులు
బెంగళూరు : కర్నాటకలోని మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహకు చేదు అనుభవం ఎదురైంది. తమ గ్రామానికి రావద్దంటూ మైసూరు జిల్లా గుజ్జెగౌడనపురా గ్రామ దళితులు సోమవారం ఆయన్ని అడ్డుకున్నారు. అయోధ్యలో జరిగిన బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని గ్రామ స్థులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ఓ దేవాలయ నిర్మాణం కోసం భూమిపూజను నిర్వ హించారు. దీనికి హాజరయ్యేందుకు ఎంపీ రాగా వారు ఆయన్ని నిలువరించారు. అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసిన రామ్‌ లల్లా విగ్రహానికి అవసరమైన శిలను గ్రామానికి చెందిన దళితుడైన రామదాసు తన భూమి నుంచి విరాళంగా అందజేశారు. దేవాలయ నిర్మాణానికి కావాల్సిన భూమిని కూడా ఆయనే ఉచితంగా ఇచ్చారు. మెడ చుట్టూ కాషాయ కండువా వేసుకున్న ప్రతాప్‌ సింహ దళితులలో వాగ్వివాదానికి దిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయ్యాయి. నిరసన తెలుపుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. అతని మెడపై చేతులు వేసి దౌర్జన్యం చేశారు. ‘మీరు గత పది సంవత్సరాలుగా ఈ ఊరికి రాలేదు. ఇప్పుడు రాజకీయ కారణాలతో వచ్చారు. అసలు మీరు ఎప్పుడూ మేము చెప్పేది విన్పించుకోలేదు. మీరు ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు’ అని తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు సురేష్‌ నిలదీశారు. సింహకు రక్షణగా వచ్చిన పోలీసులు అతన్ని పక్కకు లాగి ఎంపీని వాహనంలో తరలించారు. ఆ సమయంలో స్థానిక జనతాదళ్‌ (సెక్యులర్‌) ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ కూడా అక్కడే ఉన్నారు. కాగా రామదాసు బంధువైన స్వామి హరోహల్లి విలేకరులతో మాట్లాడుతూ ‘గత సంవ త్సరం ప్రతాప్‌ సింహ మా దళితుల పైన, నాయకుల పైన అవాకులు చవాకులు పేలారు. ఆయన ఆదేశాలతో కొందరు గ్రామస్థులను అరెస్ట్‌ కూడా చేశారు. ఆయన మా గ్రామం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. మా సమస్యలు అడగలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. అందుకే వచ్చారు’ అని అన్నారు. గ్రామస్థుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురు కావడంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ప్రతాప్‌ సింహ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దళితులకు నచ్చచెప్పేందుకు స్థానిక ఎమ్మెల్యే, ఇతర నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సింహ గతంలో ఇద్దరు వ్యక్తులకు పార్లమెంట్‌ విజిటింగ్‌ పాసులు ఇవ్వడం, వారు ఆ పాసులతో చట్టసభలో ప్రవేశించి గలాభా సృష్టించడం తెలిసిందే. అయినప్పటికీ లోక్‌సభ స్పీకర్‌ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Spread the love