అక్షర క్రిటి బిరుదుతో పాటు ఉత్తమ కవిత అవార్డు ప్రధానం
నవతెలంగాణ-నెల్లికుదురు
జిల్లాలోని రాజులకోతపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ జిల్లా యువ నాయకులు వరిపల్లి అనిల్ కుమార్కు సాహిత్య రంగంలో అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 20న భద్రాచలంలోని రాజ్ పాల్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన శ్రీ శ్రీ కళావేదిక 176వ భాషా కవితా పండుగ కార్యక్రమంలో అనిల్ కుమార్కు “అక్షర కిరీటి” బిరుదును ప్రదానం చేయడంతో పాటు, ఆయన రచించిన కవితకు “ఉత్తమ కవిత అవార్డు” అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు అనిల్ కుమార్ను శాలువాతో సత్కరించి, ప్రశంసా పత్రంతో పాటు అవార్డును అందజేశారు. సాహిత్యంపై ఆసక్తితో సామాజిక అంశాలను తన రచనల్లో ప్రతిబింబిస్తూ కొనసాగుతున్న మహబూబాబాద్ జిల్లా యువ నాయకుడికి ఈ గౌరవాలు లభించడం పట్ల పలువురు సాహితీవేత్తలు, కవులు, అభిమానులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వరిపల్లి అనిల్ కుమార్ మాట్లాడుతూ..రాజకీయ రంగంలో సమాజ సేవ చేస్తూనే, తెలుగు సాహిత్యం, సంస్కృతిని రచనల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. అక్షరమే ఆయుధంగా, సాహిత్యమే సామాజిక చైతన్యానికి వేదికగా తన రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తానని అనిల్ కుమార్ పేర్కొన్నారు. రాజకీయ, సామాజిక సేవతో పాటు సాహిత్య రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ “అక్షర కిరీటి” బిరుదు, “ఉత్తమ కవిత” అవార్డు అందుకోవడం పట్ల ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.



