– సుమారు 20 ఎకరాల్లో క్షేత్రస్థాయి సర్వే
– పట్టాదారులు సరిహద్దులు, విస్తీర్ణం పరిశీలించుకోవాలి
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియ అశ్వారావుపేట నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని దమ్మపేట మండలం ఆఖినేపల్లి, అశ్వారావుపేట మండలం దురదపాడు రెవెన్యూ గ్రామాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సర్వేయర్ నాగరాజు పర్యవేక్షణలో సూపర్వైజర్, లైసెన్స్డ్ సర్వేయర్ల బృందాలు ఆధునిక సర్వే పరికరాలతో భూములను కొలుస్తున్నాయి. సర్వేకు సంబంధించిన ప్రక్రియను పరిశీలించేందుకు ఆయా గ్రామాల రైతులు, పట్టాదారులు పాల్గొంటున్నారు.
వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భూ రికార్డుల నవీకరణ:
ఇప్పటికే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములను ఆధునిక సర్వే పద్ధతులతో తిరిగి కొలిచి విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్లు, సబ్‌డివిజన్ వివరాలను క్షేత్రస్థాయిలో నిర్ధారించి రికార్డులను నవీకరించడం రీసర్వే ప్రధాన ఉద్దేశం. పాత సర్వేల్లో ఉన్న కొలతల లోపాలు, సరిహద్దుల అస్పష్టత, విస్తీర్ణంలో తేడాలు, సబ్‌డివిజన్ సమస్యలను గుర్తించి సరిచేయడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్పష్టంగా గుర్తించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది.
సరిహద్దులు రాళ్ళు లేకపోయినా,ఒకవేళ తొలగించినా ఆధునిక సర్వే పరికరంతో సర్వే చేస్తుండటంతో కచ్చితమైన కొలతలు వచ్చే అవకాశం ఉందని, భూ రికార్డులను డిజిటల్ మ్యాప్‌లతో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలు, సరిహద్దు సమస్యలు, ఆక్రమణలకు అవకాశం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు పేర్కొంటున్నారు.
పట్టాదారులకు స్పష్టత:
రీసర్వే పూర్తయిన తర్వాత పట్టాదారులకు తమ భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, వాస్తవ విస్తీర్ణం ఎంత, నాలుగు వైపుల సరిహద్దులు ఏమిటి అనే అంశాల్లో మరింత స్పష్టత లభిస్తుంది. రికార్డుల్లో ఏమైనా తేడాలు ఉంటే నిర్ణీత ప్రక్రియలో అభ్యంతరాలు తెలియజేసి సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే రీసర్వే కొత్తగా భూమిపై యాజమాన్య హక్కును కల్పించే ప్రక్రియ కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇది ప్రధానంగా భూమి కొలతలు, సరిహద్దులు, మ్యాప్‌లు, సబ్డివిజన్లు, రెవెన్యూ రికార్డుల ఖచ్చితత్వానికి సంబంధించిన ప్రక్రియ. యాజమాన్య వివాదాల విషయంలో పట్టా, రిజిస్ట్రేషన్ పత్రాలు, వారసత్వ రికార్డులు, కోర్టు ఉత్తర్వులు తదితర ఆధారాలకు ప్రాధాన్యం ఉంటుంది.
పట్టాదారులు ఈ అంశాలు పరిశీలించాలి:
రీసర్వే సమయంలో పట్టాదారులు తమ భూమికి సంబంధించిన వివరాలను స్వయంగా పరిశీలించుకోవడం అవసరం. ముఖ్యంగా – సర్వే నంబర్ రికార్డులతో సరిపోతుందో చూడాలి. రికార్డుల్లోని విస్తీర్ణం – క్షేత్రస్థాయిలో కొలిచిన విస్తీర్ణం సరిపోల్చుకోవాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపుల నాలుగు సరిహద్దులను పరిశీలించాలి. సర్వే రాళ్లు, హద్దులు సరైన ప్రదేశంలో ఉన్నాయో చూడాలి. ఒకే సర్వే నంబర్లో పలువురు పట్టాదారులు ఉంటే సబ్‌డివిజన్ వివరాలు స్పష్టంగా ఉన్నాయో పరిశీలించాలి. క్షేత్రంలోని భూమిని సర్వే మ్యాప్, రెవెన్యూ రికార్డులతో పోల్చుకోవాలి. పట్టాదారు పేరు, తండ్రి/భర్త పేరు తదితర వివరాల్లో తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వ భూమి, చెరువు, కాలువ, రోడ్డు, అటవీ భూమి వంటి వాటితో సరిహద్దు ఉంటే ప్రత్యేకంగా పరిశీలించాలి.
విస్తీర్ణం, సరిహద్దు, సర్వే నంబర్, సబ్‌డివిజన్ లేదా మ్యాప్‌లో పొరపాటు కనిపిస్తే లిఖితపూర్వకంగా అభ్యంతరం నమోదు చేయాలి. పట్టాదారు పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు, పాత పహాణీలు, సర్వే మ్యాప్, వారసత్వ పత్రాలు తదితర ఆధారాలను భద్రంగా ఉంచుకోవాలి.
అప్రమత్తతే ముఖ్యం:
భూ రీసర్వే సమయంలో అధికారులు భూమిని కొలిచారని మాత్రమే కాకుండా, రికార్డుల్లోని విస్తీర్ణం, క్షేత్రంలోని వాస్తవ సరిహద్దులు, సర్వే మ్యాప్, సబ్‌డివిజన్ వివరాలు పరస్పరం సరిపోతున్నాయా లేదా అన్నది పట్టాదారులు పరిశీలించుకోవడం కీలకం. ఏదైనా తేడా గుర్తిస్తే సర్వే పూర్తయ్యే ముందే సంబంధిత అధికారులకు తెలియజేసి, నిర్ణీత ప్రక్రియలో అభ్యంతరం నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే భూ సమస్యలను నివారించవచ్చు.



