Monday, September 21, 2026
E-PAPER
Homeఖమ్మంరైతులకు ఉపయోగపడే సాంకేతికతను చేరవేయాలి

రైతులకు ఉపయోగపడే సాంకేతికతను చేరవేయాలి

- Advertisement -

– అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జె. హేమంత్‌కుమార్‌
నవతెలంగాణ – అశ్వారావుపేట

రైతులకు ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి చేరవేయాలని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ జె. హేమంత్‌కుమార్‌ అన్నారు. ములుగు జిల్లాకు చెందిన సుమారు 40 మంది డీఏఈఎస్ఐ (డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఎక్స్టెన్షన్‌ సర్వీస్‌ ఫర్‌ ఇన్‌పుట్‌ డీలర్స్‌) అభ్యర్థులు సోమవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ పంటలు, ఉద్యానవన విభాగాలు, ప్రదర్శనా క్షేత్రాలను పరిశీలించారు.

కళాశాల ప్రాంగణంలోని ఆయిల్‌పామ్‌ తోటలు, వివిధ రకాల మామిడి, పూలు, ఉద్యాన పంటలను డీలర్లు సందర్శించారు. ఆయా పంటల సాగు విధానాలు, ఉత్పత్తి సాంకేతికతలు, యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా క్లైంబర్‌ ఫ్రూట్‌ బ్లాక్‌ వారిని ఆకట్టుకుంది. డ్రాగన్‌ ఫ్రూట్‌, ద్రాక్ష, ప్యాషన్‌ ఫ్రూట్‌, గాక్‌ ఫ్రూట్‌ సాగులో అనుసరిస్తున్న ఆధునిక పందిళ్ల విధానం, మొక్కల శిక్షణ, నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం, పంటల సంరక్షణ పద్ధతులను పరిశీలించారు.

ఈ సందర్భంగా డీలర్లు తమ ప్రాంతాల్లో రైతులతో పనిచేస్తూ ఎదుర్కొంటున్న సమస్యలు, క్షేత్రస్థాయి అనుభవాలను కళాశాల శాస్త్రవేత్తలతో పంచుకున్నారు. రైతులకు శాస్త్రీయ సలహాలు అందించే వ్యవసాయ విజ్ఞాన వారధులుగా ఇన్‌పుట్‌ డీలర్లు పనిచేయాల్సిన అవసరాన్ని చర్చించారు.

అనంతరం నిర్వహించిన సమావేశంలో డాక్టర్‌ జె. హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ రైతుల విజయానికి శాస్త్రీయ పరిజ్ఞానం, సరైన సమయంలో సరైన సలహా కీలకమన్నారు. రైతులు వ్యవసాయ ఇన్‌పుట్‌ డీలర్లను సులభంగా సంప్రదించే అవకాశం ఉన్నందున, తమకు అందుబాటులో ఉన్న శాస్త్రీయ సమాచారాన్ని రైతులకు సరైన విధంగా అందించాలని సూచించారు. రైతుల ఆర్థిక పరిస్థితులు, స్థానిక వాతావరణం, పంటల పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతలను వివరించడం ద్వారా ఉత్పాదకత, ఆదాయం పెంపుతోపాటు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి డీలర్లు దోహదపడగలరని తెలిపారు. ఇలాంటి క్షేత్ర సందర్శనలు శాస్త్రీయ సాంకేతికతను రైతులు, డీలర్లకు చేరువ చేయడంలో దోహదపడతాయని అన్నారు.

కార్యక్రమాన్ని డాక్టర్‌ పి. నీలిమ, డాక్టర్‌ శివ సమన్వయం చేశారు. క్షేత్ర సందర్శన విజయవంతంగా నిర్వహించడంలో స్వామి సహకరించి, పర్యటనకు మార్గనిర్దేశం చేశారు. కళాశాలలో పరిశీలించిన రైతు ప్రయోజనకర సాంకేతికతలను తమ ప్రాంతాల్లోని రైతులకు చేరవేస్తామని డీఏఈఎస్ఐ అభ్యర్థులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -