సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు మద్దెపురం రాజు డిమాండ్
నవతెలంగాణ–ఆలేరు రూరల్
గుండాల బస్‌స్టేషన్‌ను 30 రోజుల్లో ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో బస్‌స్టేషన్‌ను పరిశీలించి, అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దెపురం రాజు మాట్లాడుతూ దాదాపు 30 ఏండ్ల క్రితం నిర్మించిన గుండాల బస్‌స్టేషన్ ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
ఏండ్ల తరబడి నిరుపయోగంగా ఉండటంతో బస్‌స్టేషన్ శిథిలావస్థకు చేరిందని తెలిపారు. రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి వెంటనే స్పందించి బస్‌స్టేషన్‌లో తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, కుర్చీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కోరారు. 30 రోజుల్లోగా బస్‌స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభించేలా టీఎస్ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో చండీరాణి, తహసీల్దార్ హరికృష్ణకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బత్తిని బిక్షం,ఎండీ ఖలీల్,ఎం.బాలయ్య,సాలమ్మ,లింగయ్య, మొగిలయ్య పాల్గొన్నారు.



