– వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవి కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతుల వ్యవసాయ వివరాలను డిజిటల్‌గా నమోదు చేసి ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు కల్పించే రైతు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ ఐడీ) ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ సోమవారం తెలిపారు.
‘‘ఒక రైతు – ఒక గుర్తింపు – సమగ్ర సేవలు’’ లక్ష్యంతో చేపడుతున్న ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో వ్యవసాయ పథకాలు, రాయితీ లు, ఎరువుల పంపిణీ, పంటల నమోదు, వ్యవసాయ రుణాలు తదితర సేవలను రైతులకు సులభంగా అందించేందుకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు.
ఇప్పటికే 67 శాతం నమోదు:
అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో ఇప్పటివరకు 39,006 మంది రైతుల వివరాలు నమోదు చేయాల్సి ఉండగా 26,142 మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయింది. మొత్తంగా 67 శాతం నమోదు పూర్తి కాగా, ఇంకా 12,864 మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తి కావాల్సి ఉంది.
మండలం రైతులు రిజిస్ట్రేషన్ శాతం మిగిలినవి
అ.రె.పల్లి. 4,591 3,206 70% 1,385
అ.పేట 10,001 6,419 64% 3,582
చ.గొండ 5,776 4,263 74% 1,513
దమ్మపేట 11,736 7,475 64% 4,261
ము.పల్లి 6,902 4,779 69% 2,123
మొత్తం 39,006 26,142 67% 12,864
పంటల వివరాల నమోదుకు ఉపయోగం:
రైతు రిజిస్ట్రేషన్ ద్వారా రైతు సాగు చేస్తున్న వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. భవిష్యత్తులో రైతులకు అందించే వ్యవసాయ సేవలు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు తదితర ప్రయోజనాలను రైతు వివరాలతో అనుసంధానం చేసేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది.
ఎరువుల పంపిణీ లోనూ:
ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్‌వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్) యాప్ ద్వారా ఎరువుల పంపిణీ, కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు రైతు రిజిస్ట్రేషన్ వివరాలు ఉపయోగపడనున్నాయి. అలాగే బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు పొందే సమయంలో రైతుల వ్యవసాయ వివరాలు డిజిటల్‌గా అందుబాటులో ఉండటం ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఎక్కడ నమోదు చేసుకోవాలి?
రైతులు మీ సేవా కేంద్రం లేదా సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ)ను సంప్రదించి రైతు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులు ఇలా తెలుసుకోవచ్చు
ఇప్పటికే రైతు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఆధార్ నంబర్ తో తమ ఫార్మర్ ఐడీ స్థితిని తెలుసుకోవచ్చు. ఇందుకోసం రైతు రిజిస్ట్రేషన్ అధికారిక పోర్టల్‌లోని చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ కోరింది.



