– నగలు కోసం బాధితుల ఆందోళన..
– బ్యాంకు వద్ద నిరీక్షణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో బంగారం తాకట్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తమకు గోల్డ్ లోన్ ఇప్పిస్తానంటూ పరిచయస్తుడైన లింగిశెట్టి నాగ సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు బంగారం తీసుకున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండా ఇతరుల పేర్లపై రుణాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం అశ్వారావుపేట సీఎస్‌బీ బ్యాంకు వద్ద బాధితులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తెలిసిన వ్యక్తి కావడంతో నమ్మి తక్కువ వడ్డీకి రుణం వస్తుందనే ఉద్దేశంతో బంగారాన్ని అప్పగించామని బాధితులు చెబుతున్నారు. అయితే బంగారం తాకట్టు పెట్టిన అనంతరం తమ పేర్లపై కాకుండా ఇతరుల పేర్లపై రుణాలు తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఒరిజినల్ రసీదులు ఇవ్వకుండా ఆలస్యం చేయడంతోపాటు డమ్మీ రసీదులు ఇచ్చారనే ఆరోపణలు కూడా బాధితుల నుంచి వినిపిస్తున్నాయి.
ఒక బాధితుడు బ్యాంకుకు వెళ్లి తన బంగారం వివరాలపై ఆరా తీయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చిందని బాధితులు పేర్కొన్నారు. దీంతో మరికొందరు బాధితులు కూడా బ్యాంకు వద్దకు చేరుకుని తమ బంగారం పరిస్థితిపై ఆరా తీశారు. తమ బంగారం ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలియక ఆందోళన చెందుతున్నామని వారు తెలిపారు.
స్లిప్పుల పంపిణీపై ఆగ్రహం:
బంగారం విడిపించుకునేందుకు అపాయింట్‌మెంట్ కోసం బ్యాంకు సిబ్బంది స్లిప్పులు పంపిణీ చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని దొరలా కూర్చోబెట్టి.. తమను దొంగల్లా లైన్లో నిలబెడతారా? అంటూ బ్యాంకు సిబ్బందిని నిలదీశారు.
స్లిప్పులు తీసుకుని వరుసలో నిలబడాలంటూ చెప్పడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ బంగారం కోసం గంటల తరబడి బ్యాంకు వద్ద వేచి ఉండాల్సి వస్తోందని, వెంటనే బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి:
ఒక వ్యక్తి ద్వారా బంగారం సేకరించి తాకట్టు పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందని బాధితులు కోరుతున్నారు. బంగారం తాకట్టు సమయంలో ఖాతాదారుల వివరాలు, బంగారం యాజమాన్యాన్ని ఎలా ధృవీకరించారు? ఇతరుల పేర్లపై రుణాలు తీసుకున్నారనే ఆరోపణల్లో నిజమెంత? ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా?
బాధితుల బంగారం ప్రస్తుతం ఎక్కడుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సెటిల్మెంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వాటి వాస్తవాలు అధికారిక దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపి, తమ బంగారం తమకు తిరిగి ఇప్పించాలని వారు కోరుతున్నారు.



