భూ సేకరణ కోసం పీసా గ్రామసభలు

– తహసీల్దార్‌ పి.చంద్రశేఖర్‌
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సీతమ్మ సాగర్‌ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా ఆదేశాల మేరకు రెవెన్యూ డివిజనల్‌ అధికారి మాలోత్‌ మంగీలాల్‌ సూచనలతో మంగళవారం చిన్న బండి రేవు గ్రామంలో గల 41-22 ఎకరములు, లక్ష్మీనరసింహారావుపేట గ్రామంలో 50-10 ఎకరములు భూ సేకరణ చేయుటకు గాను పీసా గ్రామ సభలను చిన్న బండి రేవు, పర్ణశాల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పీసా గ్రామసభలలో భూములు కోల్పోతున్న రైతుల వివరాలను చదివి వినిపించగా తాము అన్ని విధాల సహకరిస్తామని భూ నిర్వాసిత రైతులు తెలిపినట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తెల్లం సీతమ్మతో పాటు సర్పంచులు తెల్లం వరలక్ష్మి, కారం జయ, గిర్దావర్లు ఆదినారాయణ, లక్ష్మయ్య, సర్వేయర్‌ సున్నం నర్సయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ నరసింహారావు, రెండు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
పర్యావరణ అనుమతులు లేకుండా భూ సేకరణ ఎలా నిర్వహిస్తారు : టీడీపీ
పర్యావరణ అనుమతులు లేకుండా సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టు 2వ విడత భూసేకరణ పేరుతో పీసా గ్రామసభలు ఎలా నిర్వహిస్తున్నారని టీడీపీ మండల అధ్యక్షులు కొమరం దామోదర్‌ రావు విమర్శించారు. భూసేకరణ కోసం అధికారులు నిర్వహిస్తున్న గ్రామ సభలు కోర్టు ధిక్కారమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పర్ణశాల వైస్‌ ప్రెసిడెంట్‌ వాగె ఖాదర్‌ బాబు, పీసా కమిటీ కార్యదర్శి వాగె రాజేశ్వరి, పొడియం వెంకట రమణ, పి.లలిత, తుష్టి కామరాజు, పూనెం భూపతిరాజు, పాయం హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love