కట్టమల్లన్న చెరువు వద్ద పటిష్ట ఏర్పాట్లు..
శాఖల సమన్వయంతో భద్రతా చర్యలు
నవతెలంగాణ–గీసుకొండ
వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టిన ఏర్పాట్లను లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ వై.వి. గణేష్ పరిశీలించారు. 16వ డివిజన్ పరిధిలోని కట్టమల్లన్న గుడి ప్రాంగణంలోని చెరువు వద్ద నిమజ్జనానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జన కార్యక్రమం కోసం రెండు భారీ క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఎండోమెంట్, ఎన్టీపీసీఎల్, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన ప్రాంతంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులను భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రధాన మార్గాల్లో పోలీసు సిబ్బందిని మోహరించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. నిమజ్జన ప్రాంతాన్ని సీసీ కెమెరాల ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చెరువు వద్ద ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. నిమజ్జన సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరారు. వైద్యశాఖ, మున్సిపల్ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు కూడా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సాంబయ్య, మధు, గొర్రెకుంట పంచాయతీ కార్యదర్శి రాజు, డీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి కొమురారెడ్డి, 15వ డివిజన్ అధ్యక్షుడు కందుల అశోక్, ఎన్.చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.



