ఎంపీగా పోటీ చేసినప్పుడే ఇలాంటి పరిస్థితులు
వస్తాయని ఊహించా : ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ- బంజారాహిల్స్
హైకోర్టు తీర్పు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను తాను ముందుగానే ఊహించానని, ఇక ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తన అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. హైకోర్టు తీర్పు అనంతరమే ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అయితే సన్నిహితుల సూచన మేరకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభిస్తుందని భావించి పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేశానని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా కాకుండా సొంత ఇంటి మనిషిగా భావిస్తారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన సందర్భంగా తన ప్రత్యర్థి కిషన్‌రెడ్డికి గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు. సమయం లేకపోవడం, ఇతర కారణాల వల్లే ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైందన్నారు. తాను ఎంపీగా గెలిచి ఉంటే ఎమ్మెల్యేగా వేరొకరిని బరిలోకి దించి గెలిపించుకునేవాడినన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నానని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనకు సంపూర్ణంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలోకి తిరిగి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.



