
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ, విద్యా ప్రమాణాలు పాటించని అల్ఫోర్స్ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని, తప్పుడు అర్హత పత్రాలతో గుర్తింపు తీసుకొని నడుస్తున్న ఆల్ఫోర్స్ పాఠశాలకు పర్మిషన్ ఇచ్చిన ఎంఈఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా విద్యాశాఖ ఏడికి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని నిర్లక్ష్యంగా ఉన్న హుస్నాబాద్ ఎంఇఓ ను సస్పెండ్ చేయాలని వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. హుస్నాబాద్ లో నిబంధనలు పాటించకుండా నడుస్తున్న ఆల్ఫోర్స్ పబ్లిక్ స్కూల్ పై విద్యాధికారి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు . ఆల్ఫోర్స్ స్కూల్ ఎలా పర్మిషన్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.. జీవో నెంబర్ 1 ప్రకారం ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులను తీసుకోకుండా ఇష్టరీతి లో ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యా బోధన చేస్తున్న టీచర్లకు బీ.ఈ.డి, టేట్ క్వాలిఫికేషన్ లేకున్నా కూడా వారితో విద్యా బోధన చేస్తున్నారని పేర్కొన్నారు. టీచర్లు విద్యార్థులను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు.. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవని,విద్యార్థులకు అనుగుణంగా గ్రౌండ్ లేదని, ఫైర్ సేఫ్టీ లేదని పూర్తిగా విద్య హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి పాఠశాల నడుస్తోందని అన్నారు. ఇదంతా విద్యాధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు..ఇప్పటికైన డి.ఈ ఓ స్పందించి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని, ఈ పాఠశాల కు పర్మిషన్ ఇచ్చిన ఎంఇఓ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వేల్పుల ప్రసన్న కుమార్, సిద్ధుల సుమన్ లు ఉన్నారు.