జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు

Telugu Tejalu shined in JEE Mains– ఫలితాలు విడుదల
– 23 మందికి 100 శాతం స్కోరు
– తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు
న్యూఢిల్లీ : జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి తమ సత్తా చాటారు. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఈ పేపర్‌-1 (బీఈ/బీటెక్‌) ఫలితాల్లో దేశవ్యాప్తంగా 23మంది విద్యార్థులు 100 శాతం స్కోరు సాధించారు. వీరిలో 10 మంది దాకా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. తెలంగాణ నుంచి ఏడుగురు విద్యార్థులు ఈ ఘనత సాధించారు. తెలంగాణకు చెందిన పబ్బ రోహన్‌ సాయి, ముతవరపు అనూప్‌, రిషి శేఖర్‌ శుక్లా, హుందేకర్‌ విదిత్‌, మదినేని వెంకట సాయి తేజ, తవ్వ దినేశ్‌ రెడ్డి, కల్లూరి శ్రియాషస్‌ మోహన్‌లు జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1లో 100 శాతం స్కోరు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్‌ సూరజ్‌, తోట సాయి కార్తిక్‌, అన్నారెడ్డి తనీశ్‌ రెడ్డి 100 శాతం స్కోరు సాధించారు. రాజస్థాన్‌, మహారాష్ట్ర నుంచి ముగ్గురు.. హర్యానా, ఢిల్లీ నుంచి ఇద్దరు.. గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు చొప్పున 100 శాతం స్కోరు సాధించారు. 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్‌ తొలి విడత పేపర్‌-1 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 11,70,036 మంది విద్యార్థులు హాజరయ్యారు.
కాగా, జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను జేఈఈ అధికారిక వెబ్‌ సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చు. అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్‌ పర్సంటైల్‌ కూడా తెలుసుకోవచ్చు. సెషన్‌ 1 తుది కీని ఎన్‌టిఎ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన విషయం తెలిసిందే. చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్టు ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెషన్‌ 1 రాసిన విద్యార్థులు సెషన్‌ 2కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు రెండింటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.

Spread the love