ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రబౌ సుబియాంటోకు తిరుగులేని ఆధిక్యం

Prabow Subianto has an undisputed lead in the Indonesian presidential electionజకార్తా : అధ్యక్ష ఎన్నికల్లో ఇండోనేషియా రక్షణ మంత్రి ప్రబౌ సుబియాంటో ఆధిక్యంలో కొనసాగుతు న్నారు. అనధికారిక ఫలితాల మేరకు ప్రత్యర్థులపై ఆయన గణనీయమైన ఆధిక్యాన్ని చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శీఘ్రగణన బ్యాలెట్ల ఆధారంగా ప్రబౌ సుబియాంటోకు దాదాపుగా 58 శాతం ఓట్లు పోలైనట్లు స్వతంత్ర పోస్టలర్స్‌ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రాథమిక లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతోందని, ప్రబౌకు 57.7 శాతం ఓట్లు నమోదు కాగా, ప్రత్యర్థులు అనిస్‌ బస్వెదన్‌, గంజర్‌ ప్రనోవ్‌లు వరుసగా 25 శాతం మరియు 17 శాతంతో వెనుకబడినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో నమూనా ఓట్ల ఆధారంగా శీఘ్రగణన జరుగుతుంది. ఇండోనేషియాలో ఓట్ల లెక్కింపు అనేది సుదీర్ఘ ప్రక్రియ. అధికారిక ఫలితాల వెల్లడికి దాదాపు నెల రోజుల వరకు సమయం పట్టొచ్చు. 2004 నుంచి జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నికలోనూ శీఘ్రగణన అంచనాల ఆధారంగానే తుది ఫలితాలొచ్చాయి. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధించినట్లు ప్రబౌ సుబియాంటో ప్రకటించారు. జకార్తాలోని ఓ స్టేడియంలో మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విజయం పట్ల గర్వం, అహంకారం కూడదని, వినయంతో ఉండాలని వ్యాఖ్యానించారు. అత్యుత్సాహం కూడదని ఈ విజయం దేశ ప్రజలందరి విజయం కావాలని అన్నారు. శీఘ్ర గణన ఫలితాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో పాటు మాజీ అధ్యక్షుడు జొకొ విడొడొ కుమారుడు జిబ్రన్‌ రకబుమింగ్‌ రాకా కూడా ఉన్నారు.

Spread the love