మాస్కో: అవ్‌దీవ్‌కా నగరం పూర్తిగా రష్యా సైన్యం వశమైందని రష్యా రక్షణ శాఖ శనివారం నాడు ప్రకటించింది. ఉపసంహరించుకునే క్రమంలో ఉక్రెయిన్ సైనికులు తమ ఆయు ధాలను,సాయుధ సామాగ్రిని తరలించు కోవటం సాధ్యపడలేదు. ఆ క్రమంలో దాదాపు 1500 మంది ఉక్రెయిన్ సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. దీనితో యుద్ధ క్షేత్రం డోనెస్క్ నగరానికి మరింత దూరం జరిగినట్టయింది. ఇది ఆ నగర ప్రజలకు ఉక్రెయిన్ బాంబు దాడుల నుంచి ఉపశమనంగా మారనుంది. ఉక్రెయిన్ నూతన సైన్యాధ్యక్షుడు పశ్చిమ దేశాలలో శిక్షణ పొందిన ఎలైట్ సైనికులను పంపినప్పటికీ అవ్‌దీవ్‌కా నగరంపైన పట్టును నిలుపుకోవటం సాధ్యపడలేదని, అందుకే ఉపసంహరణకు ఆదేశించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడీమీర్ జెలెన్‌స్కీ ఒక ప్రకటనలో తెలిపాడు. రష్యా సైన్యం అన్నివైపుల నుంచి చుట్టుముట్టడటంతో ఉపసంహరణ తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నాడు.
అవ్‌దీవ్‌కా నగరాన్ని వశపర్చుకున్నాక డోనెస్క్ ప్రాంతాన్ని మరింతగా ఉక్రెయిన్ నుంచి విముక్తం చేసే పనిలో రష్యా సైన్యం ఉంటుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అవ్‌దీవ్‌కాను విముక్తంగావించటంలో రష్యా సైనిక దళాలు గొప్ప విజయాన్ని సాధించాయని ”సెంటర్” గ్రూపు కమాండర్ జనరల్ అండ్రే మోర్ద్విచేవ్‌కు ఇచ్చిన టెలిగ్రాంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ప్రశంసించాడు. అవ్‌దీవ్‌కా నగరంలో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఓడిపోతుందని అనేక వారాలుగా అమెరికా అధికారులు, పశ్చిమ దేశాల జర్నలిస్టులు ఊహిస్తూనే ఉన్నారు. పశ్చిమ దేశాల నుంచి అందవలసిన సహాయం అందకనే ఉక్రెయిన్ అవ్‌దీవ్‌కా నగరాన్ని కోల్పోనున్నదని గత వారారంభంలో అమెరికా అధ్యక్ష భవన జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ నిందించాడు. ఈ ఓటమికి కారణం పశ్చిమ దేశాలు సష్టించిన ”ఆయుధాల కత్రిమ కొరత” అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా అన్నాడు. అమెరికా అందించవలసిన 60 బిల్లియన్ డాలర్ల సైనిక సహాయం అందకపోతే అవ్‌దేవ్‌కాలో జరిగినట్టి పరాజయం ఉక్రెయిన్‌కు అనేక చోట్ల ఎదురౌతుందని ఒక అమెరికా రక్షణ శాఖాధికారి మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.