దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చేసి నాపై గెలువు చూద్దాం

– మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పీసీసీ అధ్యక్ష పదవికి, సీఎం పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ స్పందించారు. దమ్ముంటే మల్కాజిగిరిలో నాపై పోటీ గెలువాలని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఈమేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వస్తా.. రా… చూసుకుందాం అని సవాల్‌ విసిరారు. ఎవరివైపు న్యాయం ఉంటే వారిని గెలిపించాలని కోరుదామన్నారు.సంస్కారం గురించి కేటీఆర్‌ మాట్లాడుతుంటే నవ్వు వస్తున్నదన్నారు. గతంలో మీ తండ్రి కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు సమాజం మొత్తం చూసిందన్నారు. శాసనసభలో అధికార పక్షాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ఎంత ఎగతాళిగా మాట్లాడారో ప్రజలు గమనించారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేసీఆర్‌, ఇప్పుడు ఆ విషయం విస్మరించారని గుర్తు చేశారు. పీసీసీ అధ్యక్షుడి స్థానంలో రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ సవాల్‌ను స్వీకరించి 64 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీల అమలు ప్రక్రియను ప్రారంభించారని తెలిపారు. ప్రజల దృష్టి మళ్ళించేందుకు కేటీఆర్‌ ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Spread the love