
– పురుగుల మందు డబ్బాతో వచ్చిన రైతు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన బాట పట్టారు. సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, చివ్వేంల మండలాల పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముంద నిరసన తెలిపారు.ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ ఎస్సారెస్పీ పరిధిలోని 69, 70, 71 డీబీఎం కాల్వలల్లో సామర్ద్యానికి సరిపడా నీళ్ళు రాకపోవడంతో చివరి ఆయకట్టుకి నీళ్ళు అందక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భారీగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తున్నామని పంటలు చేతికొచ్చే వేళ సరిపడా నీళ్ళు అందక ఎండిపోతున్నాయని , పంటలు కాపాడుకోవాలంటే మరో 15 రోజులు పాటు నీళ్ళు అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని కలెక్టరేట్ ముందు నిరసన తెలిపిన రైతుల్లో ఒకరైన నూతనకల్ కేంద్రాకి మండలానికి చెందిన మల్లారెడ్డి పురుగుల మందు డబ్బాతో వచ్చి నిరసన సమయంలో త్రాగేందుకు ప్రయత్నించారు.అక్కడే ఉన్న డ్యూటీ పోలీసులు ఈ విషయాన్ని గమనించి పురుగుల మందు డబ్బాను తీసుకున్నారు.అయితే ఇందులో పురుగుల మందు లేదని కేవలం ఖాళీ డబ్బాలో నీరు పోసి పురుగుల మందుగా చిత్రికరించి బెదిరింపులకు పాల్పడ్డారని ఇంటలీజెన్స్ పోలీసులు తెలిపారు.ఈ విషయంపై సంబందిత చివ్వెంల పోలీస్ అధికారులను అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అనంతరం కలెక్టరేట్ ఏవో సుదర్శన్‌రెడ్డికి వినతీపత్రం అందజేశారు.