– ఎలక్టోరల్ బాండ్లతో బీజేపీకి భారీ విరాళాలు
– 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు రూ. 1,700 కోట్లు ఎన్‌క్యాష్
– 2024 ఎన్నికలకు ముందు రూ. 202 కోట్లు సమకూర్చుకున్న వైనం
– ఐదేండ్లలో పలు రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసుకున్న మొత్తం రూ. 12,769 కోట్లు
– ఇందులో సగభాగం కాషాయ పార్టీదే
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం ఆ పార్టీకి భారీగా విరాళాలను మోసుకొచ్చింది. 2019 నుంచి 2024 మధ్య అన్ని పార్టీల కంటే ఆ పార్టీకే ఎన్నికల బాండ్ల ద్వారా ఎక్కువ విరాళాలు వచ్చాయి. బాండ్లను బ్యాంకులలో నగదుగా మలుచుకోవటం (ఎన్‌క్యాష్‌మెంట్)లోనూ బీజేపీనే ముందున్నది. గత ఐదేండ్లలో రాజకీయ పార్టీలు ఎన్‌క్యాష్ చేసిన రూ.12,769 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లలో దాదాపు సగభాగాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. ఈ చందాతో ఎన్నికల్లో కాసులు గుమ్మరించి..ఓట్లు దండుకుంటోంది. ఇందులో మూడింట ఒక వంతు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో వచ్చింది. ఇక కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది జనవరిలో పార్టీ ఇప్పటికే రూ.202 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను క్యాష్ చేసింది.భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ డేటా ప్రకారం.. రాజకీయ పార్టీలలో అత్యధిక మొత్తంలో ఎలక్టోరల్ బాండ్లను (మొత్తం రూ.6,060.52 కోట్లు) బీజేపీ ఎన్‌క్యాష్ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2023 నవంబర్‌లో తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన ఎన్నికల సమయంలో ఆ పార్టీ అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లను ఎన్‌క్యాష్ చేసుకున్నది.ఏప్రిల్ 12, 2019 నుంచి ఈ ఏడాది జనవరి 24 వరకు ఆ పార్టీ విడిపించుకున్న మొత్తం సొమ్ములో మూడింట ఒక వంతు.. 2019లోని ఏప్రిల్, మే నెలల్లోనే (ఏప్రిల్ 2019లో రూ.1,056.86 కోట్లు మరియు మే 2019లో రూ.714.71 కోట్లు) కావటం గమనార్హం. నవంబర్ 2023లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది రూ.702 కోట్లుగా ఉన్నది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు జనవరి 2022లో (రూ.662.20 కోట్లు) ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మలుచుకోవటం పెరిగింది. మళ్లీ నవంబర్ 2022లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలు ఎన్నికలు జరిగినపుడు ఇది పునరావృతమైంది.బీజేపీ, తణమూల్ కాంగ్రెస్ తర్వాత పార్టీలలో మూడో అత్యధిక మొత్తాన్ని పొందిన కాంగ్రెస్.. ఐదేండ్ల కాలంలో మొత్తం రూ. 1421.87 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందుకున్నది. అక్టోబర్ 2023లో తెలంగాణతో సహా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ రూ.401.91 కోట్లతో మూడు రెట్లు అధికంగా ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మలుచుకున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కంటే (ఏప్రిల్ 2019లో రూ. 118.56 కోట్లు) ఇది ఎక్కువ కావటం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో బాండ్ల ఎన్‌క్యాష్ ద్వారా కాంగ్రెస్ రూ.35.9 కోట్లను ఆర్జించింది.