– దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దళితులు తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కల్పించాలని దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి డిమాండ్ చేసింది. బుధవారం సాధన సమితి ఆధ్వర్యంలో క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనాన్ని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య మాట్లాడుతూ ఎఫ్ సీలు, బీసీలు, ఎస్టీలు ఏ మతాన్ని అనుసరిస్తున్నా… వారి రిజర్వేషన్లను అనుభవిస్తున్నారని తెలిపారు. ఎస్సీల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా క్రైస్తవులైతే ఎస్సీ రిజర్వేషన్లను తొలగిస్తూ వివక్ష చూపించడం తగదని హితవు పలికారు. దళితులకు మత స్వేచ్ఛను కల్పించే వారికే తమ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మగల్ల కృష్ణ, రాష్ట్ర నాయకులు మారపాక ప్రభాకర్, పల్లె భూమమ్మ, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్, ఉపాధ్యక్షులు జి.ప్రకాశ్, స్వామిదాస్, ఎ.జైపాల్ పాల్గొన్నారు.