– ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా
– డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఘన విజయం
– ఛేదనలో ఎడెన్ మార్క్రామ్, బవుమా అద్భుతం
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ఐదు సార్లు సెమీఫైనల్లో (1992, 1999, 2007, 2015, 2023) పరాజయం. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఓ సారి (2024) టైటిల్ పోరులో భంగపాటు.. రెండు సార్లు (2009, 2014) సెమీస్‌లో పరాభవం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఏకంగా ఐదు సార్లు సెమీఫైనల్లోనే (2000, 2002, 2006, 2013, 2025) ఆశలు ఆవిరి.
గత 27 ఏండ్లలో ఐసీసీ టైటిల్ వేటలో దక్షిణాఫ్రికాకు రెండు సార్లు క్వార్టర్‌ఫైనల్స్‌లో, 12 సార్లు సెమీఫైనల్స్‌లో, ఓ సారి ఫైనల్లో హృదయం ముక్కలైంది. 2025 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ సఫారీలకు మరోసారి గుండెకోత తప్పదేమో అనిపించింది. ఒత్తిడిని, కంగారూలను జయిస్తూ సఫారీలు ఎట్టకేలకు విజయబావుటా ఎగురవేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించింది.
282 పరుగుల ఛేదనలో ఎడెన్ మార్క్రామ్ (136), తెంబ బవుమా (66) అసమాన పోరాట పటిమ చూపించారు. మూడో వికెట్‌కు 147 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మలుపు తిప్పారు. మార్క్రామ్, బవుమా మెరుపులతో దక్షిణాఫ్రికా చారిత్రక విజయం సాధించింది. 27 ఏండ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచింది.
నవతెలంగాణ-లార్డ్స్
దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ప్రపంచ క్రికెట్లో అగ్రజట్టుగా కొనసాగినా ఐసీసీ టైటిల్ లోటు సఫారీ క్రికెటర్లలో, అభిమానుల్లో సుస్పష్టం. ఐసీసీ టైటిల్ వేటలో ‘కలలు చెదిరే కన్నీటి పరాజయాలే’ దశాబ్దాలుగా దక్షిణాఫ్రికాను వెంటాడాయి. ఐసీసీ టైటిల్ వేటలో నిరుడు ఆఖరు అడుగులో (2024 టీ20 ప్రపంచకప్) తడబాటుకు గురైన దక్షిణాఫ్రికా.. తాజాగా 2025 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కన్నీటి రికార్డులను తిరగరాసింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఐసీసీ 2025 ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించింది. 282 పరుగుల ఛేదనలో ఓపెనర్ ఎడెన్ మార్క్రామ్ (136, 207 బంతుల్లో 14 ఫోర్లు) సెంచరీతో సమర శంఖం పూరించగా.. కెప్టెన్ తెంబ బవుమా (66, 134 బంతుల్లో 5 ఫోర్లు) గాయం వేధిస్తున్నా ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని అర్థ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియా పేసర్లు క్రమశిక్షణతో బంతులేసి ఒత్తిడి సృష్టించినా.. మార్క్రామ్, బవుమా జోడీ సఫారీలను ఒడ్డుకు చేర్చింది. 83.4 ఓవర్లలో 3.37 రన్‌రేట్‌తో 282 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా.. నాల్గో రోజు ఆట ఉదయం సెషన్లోనే లాంఛనం ముగించింది. ఛేదనలో శతకంతో చెలరేగిన ఎడెన్ మార్క్రామ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా గదతో పాటు రూ.31 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకుంది.
మార్క్రామ్ ముందుండి
ఓవర్‌నైట్ స్కోరు 213/2తో నాల్గో రోజు ఉదయం బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా విజయానికి మరో 69 పరుగుల దూరంలోనే నిలిచింది. లోకల్ అభిమానులు సఫారీలకు మద్దతుగా నిలిచి ప్రతి పరుగుకు చీర్స్ కొట్టారు. ఉదయం సెషన్లో బవుమా పరుగుల వేట షురూ చేయగా.. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సూపర్ బంతితో బవుమా నుంచి ఎడ్జ్ సాధించాడు. దీంతో 147 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 17.4 ఓవర్లలో 70/2తో కష్టాల్లో కూరుకున్న దక్షిణాఫ్రికాను మార్క్రామ్ జతగా బవుమా నిలబెట్టాడు. 250 బంతుల్లో 147 పరుగులు జోడించి సఫారీలను గెలుపు వాకిట నిలబెట్టాడు. ఆఖరు వరకు విజయం కోసం పోరాడే కంగారూలు.. బంతితో ఆకట్టుకున్నారు. కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్‌లు కట్టుదిట్టంగా బంతులేశారు. మార్క్రామ్ అప్పుడప్పుడు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేయటంతో ఆసీస్ శిబిరంలో ఆశలు చిగురించాయి. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోరు 241. మరో 41 పరుగులే చేయాల్సిన దశలో మార్క్రామ్, డెవిడ్ (21 నాటౌట్) జోడీ మరో భాగస్వామ్యం నిర్మించారు. ఆసీస్ కొత్త బంతి అందుకునే సమయానికి సఫారీలకు మరో 14 పరుగులే అవసరం. కొత్త బంతితో హాజిల్‌వుడ్‌పై 4, 3 పరుగులు చేసిన మార్క్రామ్.. అదే ఓవర్లో హెడ్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. మార్క్రామ్ అవుటయ్యే సమయానికి సఫారీలకు మరో ఆరు పరుగులు అవసరం. టెయిలెండర్ కైల్ వెరెనె (4 నాటౌట్) తోడుగా డెవిడ్ లాంఛనం ముగించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ (3/66), జోశ్ హాజిల్‌వుడ్ (1/58), పాట్ కమిన్స్ (1/59) వికెట్లు పడగొట్టారు.
అతడే ఒక సైన్యమై!
లార్డ్స్ పిచ్ పేసర్లకు చక్కగా సహకరిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 పరుగులకు కుప్పకూలినా.. పాట్ కమిన్స్ ఆరు వికెట్లతో విజృంభించి దక్షిణాఫ్రికాను 138 పరుగులకే ఆలౌట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల విలువైన ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. తొలి రెండు రోజుల్లో ఆధిపత్యం చెలాయించింది. రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (58 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో దక్షిణాఫ్రికాకు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ భీకర పేస్ త్రయం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా మాయ చేయగల నాథన్ లయాన్ ఆసీస్ అమ్ములపొదిలో ఉండగా.. సఫారీలకు మరోసారి భంగపాటు తప్పదేమో అనిపించింది. చేతిలో 8 వికెట్లు ఉండగా, మరో 69 పరుగులే చేయాల్సిన దశలో సహజంగా బ్యాటింగ్ జట్టు గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటాం. కానీ లార్డ్స్‌లో దక్షిణాఫ్రికా ఒత్తిడిలో పడింది. ప్రతి పరుగు కోసం చెమటోడ్చేలా ఆసీస్ పేసర్లు బంతులేశారు. 69 పరుగుల కోసం దక్షిణాఫ్రికా 27.4 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిందంటే కంగారూ బౌలర్లు ఏ స్థాయిలో రాణించారో తెలుస్తోంది. కానీ లార్డ్స్‌లో సఫారీ ఓపెనర్ ఎడెన్ మార్క్రామ్ (136) దక్షిణాఫ్రికా రాత తిరగరాశాడు. రియాన్ రికెల్టన్ (6), వియాన్ ముల్డర్ (27) ఆరంభంలోనే నిష్క్రమించినా.. ఓ ఎండ్‌లో నిలదొక్కుకున్నాడు. కెప్టెన్ తెంబ బవుమాతో కలిసి 147 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు. కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ సహా లయాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న మార్క్రామ్ 156 బంతుల్లో సెంచరీ సాధించాడు. డ్రైవ్, పుల్ షాట్లతో పరుగులు రాబడుతూ దక్షిణాఫ్రికాను ప్రపంచ చాంపియన్‌గా నిలిపాడు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 212/10 (వెబ్‌స్టర్ 72, స్మిత్ 66, రబాడ 5/51, జాన్సెన్ 3/49)
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ : 138/10 (డెవిడ్ 45, బవుమా 36, పాట్ కమిన్స్ 6/28)
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 207/10 (స్టార్క్ 58, అలెక్స్ 43, రబాడ 4/59, ఎంగిడి 3/58)
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ : ఎడెన్ మార్క్రామ్ (సి) హెడ్ (బి) హాజిల్‌వుడ్ 136, రియాన్ రికెల్టన్ (సి) అలెక్స్ (బి) స్టార్క్ 6, వియాన్ ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27, తెంబ బవుమా (సి) అలెక్స్ (బి) కమిన్స్ 66, ట్రిస్టన్ స్టబ్స్ (బి) స్టార్క్ 8, డెవిడ్ బెండిగ్హామ్ నాటౌట్ 21, కైల్ వెరెనె నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 14, మొత్తం : (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282.
వికెట్ల పతనం : 1-9, 2-70, 3-217, 4-241, 5-276.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 14.4-1-66-3, జోశ్ హాజిల్‌వుడ్ 19-2-58-1, పాట్ కమిన్స్ 17-0-59-1, నాథన్ లయాన్ 26-4-66-0, బ్యూ వెబ్‌స్టర్ 5-0-13-0, ట్రావిశ్ హెడ్ 2-0-8-0.
ఎన్నాండ్లో వేచిన విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES