Sunday, August 23, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయాదవ, కురుమలు ఆర్థికంగా ఎదగాలి

యాదవ, కురుమలు ఆర్థికంగా ఎదగాలి

- Advertisement -

గొర్రెలు, మేకల ఫెడరేషన్‌ ‌రాష్ట్ర చైర్మెన్‌ ‌సరితా తిరుపతయ్య
ఘనంగా ‘జీఎంపీఎస్‌’ 30వ వార్షికోత్సవాలు, రాష్ట్ర 4వ మహాసభ
సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ జాతుల గొర్రెలు, మేకలు, గొంగళ్ల ప్రదర్శన

నవతెలంగాణ-సిటీబ్యూరో
​యాదవ, కురుమలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని గొర్రెలు, మేకల ఫెడరేషన్‌ ‌రాష్ట్ర చైర్మెన్‌ ‌సరితా తిరుపతయ్య ఆకాంక్షించారు. గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్‌) 30 ఏండ్ల సంబురాల్లో భాగంగా రాష్ట్ర 4వ మహాసభ శనివారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్లలో శనివారం ప్రారంభమైంది. మహాసభ ప్రారంభ సూచికగా జెండాను జీఎంపీఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్‌ ఆవిష్కరించగా.. అనంతరం వార్షికోత్సవ ప్రారంభ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మెన్‌ సరితా తిరుపతయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకందారులు ఎదుర్కొం టున్న సమస్యలపై 30 ఏండ్లుగా సంఘం పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నదన్నారు. 50 ఏండ్లు నిండిన సభ్యులకు ఫెడరేషన్‌ ‌ద్వారా పెన్షన్‌ ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని ఎలాంటి నష్టమూ లేకుండా నిర్వహించేలా ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తానని హామీనిచ్చారు. తమ దృష్టికి వచ్చిన ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ ‌మాట్లా డుతూ.. గొర్రెల పెంపకందారులు ఎదుర్కొంటున్న సమస్యలపై 30 ఏండ్లలో అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి, అనేక విజయాలు సాధించినట్టు వివరించారు.

తుమ్మ చెట్లపై గొర్రెల కాపరులకు హక్కు కల్పించే జీవో1016, మేత భూములు కేటాయించాలని జీవో 559 ను సాధించినట్టు గుర్తు చేశారు. జీవాలకు నట్టల మందులు, వ్యాక్సిన్లు సాధించామని తెలిపారు. గొర్రెల కాపరులు ప్రమాదాల్లో మరణిస్తే రూ.లక్ష ఎక్స్‌‌గ్రేషియా సాధించినట్టు తెలిపారు. గతంలో గొర్రెలకు ఇన్సూరెన్స్, జీవక్రాంతి, ఎన్సిడిసి లాంటి పథకాలతోపాటు సబ్సిడీపై గొర్రెల పంపిణీ సాధించినట్టు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ గొర్రెల కాపరుల మీద దాడులు, దౌర్జన్యాలు జరిగినా వారికి అండగా ఉంటూ, వారి గొంతుకై ఈ సంఘం నిరంతరం ఉద్యమిస్తుందని, భవిష్యత్‌‌లో ఇంకా సాధించాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో నేటికీ గొర్రెల పెంపకం వృత్తిపై ఆధారపడి సుమారు 8 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు. 8,109 ప్రాథమిక సొసైటీల్లో 7,61,895 మంది సభ్యులున్నారని చెప్పారు. వ్యవసాయం చిన్న కమతాలుగా ఏర్పడటం, నీటి లభ్యత పెరిగి భూమి సాగులోకి రావడంతో రోజురోజుకూ మూగజీవాల మేతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. పర్యవసానంగా వలసలు వెళ్లే కాపరులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు అటవీ అధికారుల వేధింపులు పెరుగుతున్నాయని తెలిపారు. వృత్తిలో భవిష్యత్‌‌లో మరిన్ని ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట వీధి కుక్కల దాడిలో లేదా రోడ్డు ప్రమాదాల్లో వందలాది గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని, అందుకు ఎలాంటి నష్టపరిహారమూ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా నిధులు కేటాయించక, సరిపడా డాక్టర్లు లేక సకాలంలో నాణ్యమైన పశువైద్యం అందడం లేదన్నారు. వీటన్నింటిపై ఈ రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. మహాసభలో జీఎంపీఎస్‌ ‌రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎక్కలదేవి కొమురయ్య, లింగయ్య, మేక కుమార్‌, బొల్లం అశోక్‌, అమీర్‌‌పేట మల్లేష్‌, యాదగిరి, మధుకర్‌, జిల్లాల నుంచి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాలు
మహాసభ మొదటి రోజు ఒగ్గు కథ, తప్పెటగుళ్లు, గొరవయ్యలు, మందహెచ్చులు, పగిడిజోగులు తదితర సంప్రదాయ, నేటి ప్రఖ్యాత జానపద కళాకారులతో సాంస్కృతిక సంబురాలు నిర్వహించారు. వివిధ రకాల జాతుల గొర్రెలు, మేకలు, గొంగళ్ళతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సంఘంలో సేవలందించి అమరులైన వారి 40 కుటుంబాలను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి వారి త్యాగాలకు గౌరవించారు. అనేకమంది వృత్తి నిష్ణాతులను, సంఘం సీనియర్ నాయకులను మహాసభకు ఆహ్వానించి చర్చలు జరుపనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -