Saturday, September 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅందుబాటులోకి 
హైడ్రా అధికారిక పోర్టల్

అందుబాటులోకి 
హైడ్రా అధికారిక పోర్టల్

- Advertisement -


ఒకే వేదికపై పౌర సేవల సమాచారం
వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కమిషనర్‌ 
ఏవీ రంగనాథ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

​హైడ్రా అందిస్తున్న సేవల వివ‌రాల‌తో పాటు కార్యకలాపాల సమాచారాన్ని ఒకే వేదికపై తెలుసుకునేలా అధికారిక పోర్టల్‌ అందుబాటులోకి వచ్చింది. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ శుక్రవారం అధికారిక వెబ్‌సైట్‌ (https://hydraa.telangana.gov.in/) ప్రారంభించారు. హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, అధికార పరిధి, చెరువుల హద్దులు, కాలువల వివరాలు, ప్రభుత్వ భూములు, విపత్తు నిర్వహణ సమాచారం, క్షేత్రస్థాయి కార్యకలాపాలను పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. పోర్టల్‌లో హైడ్రా 24 గంటల అత్యవసర హెల్ప్‌లైన్‌ 1070 వివరాలను పొందుపరిచారు. చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు పరిస్థితులపై పౌరులు ఈ నెంబర్‌కు సమాచారం ఇవ్వొచ్చు.
​ఫైర్‌ ఎన్‌వోసీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు
హైడ్రా పోర్టల్‌ ద్వారానే ఫైర్‌ సేఫ్టీ ఎన్‌వోసీల‌కు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. భవన యజమానులు, నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారులు శాఖ డ్యాష్‌బోర్డు ద్వారా దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకునే వీలుంది. భారీ వర్షాలు, వరదల సమయంలో నీరు నిలిచే అవకాశం ఉన్న కీలక ప్రాంతాల వివరాలను అందుబాటులో ఉంచారు. జీహెచ్‌ఎంసీ, సీఏంసీ, ఏఎంసీ కమిషనరేట్ల పరిధిలోని వాటర్‌లాగింగ్‌, వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లను చూడొచ్చు. పోర్టల్‌ ద్వారా లైవ్‌ రైన్‌ఫాల్‌ మ్యాప్స్‌, రోజువారీ వర్షపాతం వివరాలు, వాతావరణ అంచనాలు, హైదరాబాద్‌ డాప్లర్‌ రాడార్‌ సమాచారం అందుబాటులో ఉంటుంది.
​ఎఫ్‌టీఎల్‌, చెరువులు, బఫర్‌ జోన్ల వివరాలు
హైడ్రా వెబ్‌సైట్‌ నుంచి ‘హెచ్‌ఎండీఏ లేక్స్‌ ప్రొటల్‌‌’ను నేరుగా సందర్శించి చెరువులకు సంబంధించిన ఫుల్‌‌ట్యాంక్‌ ‌లెవల్‌ (ఎఫ్‌‌టీఎల్‌) వివరాలను తెలుసుకోవచ్చు. చెరువులు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ నిబంధనలపై పోర్టల్‌లో సమాచారం అందుబాటులో ఉంటుంది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, తాజా వివరాలు కూడా పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. హైడ్రా అధికారిక ప్రకటనలు, ప్రెస్‌ రిలీజ్‌లు, క్షేత్రస్థాయి కార్యకలాపాలు, ముఖ్యమైన ప్రజా సమాచారం కోసం ప్రత్యేకంగా ‘న్యూస్‌, ఫ్లాస్‌ ‌న్యూస్‌’ విభాగాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటు భూ భారతి పోర్టల్‌కు హైడ్రా వెబ్‌సైట్‌లో నేరుగా లింక్‌ అందుబాటులో ఉంది. భూమి కొనుగోలు, ఇతర లావాదేవీలు చేపట్టే ముందు సర్వే నంబర్‌ లేదా పట్టాదారు వివరాల ఆధారంగా అందుబాటులో ఉన్న భూ రికార్డులను పరిశీలించుకునే అవ‌కాశం ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -