ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
న్యాయ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో రాణించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని కె.వి. రంగారెడ్డి లా కాలేజీ ఆధ్వర్యంలో “వాణిజ్య చట్టాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్‌ను ఈనెల 10, 11 తేదీల్లో ఘనంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా న్యాయ విద్య, వాణిజ్య చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటి విభిన్న అంశాలపై అధ్యాపకులు, న్యాయ నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సెమినార్ ప్రారంభ కార్యక్రమానికి బాలకిష్టారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అంతర్జాతీయ వాణిజ్య చట్టాల ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, ప్రపంచ వాణిజ్య సంస్థ పాత్ర, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం గురించి వివరించారు. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో యువత ఉండటం దేశానికి గొప్ప మానవ వనరుగా మారిందని చెప్పారు.
దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. యువత తమ విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా సిద్ధం కావాలని సూచించారు. “19వ శతాబ్దం యూరప్‌కు, 20వ శతాబ్దం అమెరికాకు చెందినదైతే, 21వ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన శతాబ్దం” అంటూ, ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ అత్యంత కీలకంగా మారిందని తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయ విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగడంతో పాటు దేశానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సెమినార్‌కు కీనోట్ స్పీకర్‌గా హాజరైన ఇక్ఫాయ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ.వినయ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలోకి కొత్తగా ప్రవేశించే వారికి అవసరమైన నైపుణ్యాలపై విలువైన సూచనలు చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ విద్య కేవలం చట్టాల పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సాంకేతిక, ఆర్థిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో కూడి ఉండాలని సూచించారు. వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న వేగవంతమైన మార్పులు న్యాయ రంగంపై కూడా ప్రభావం చూపుతున్నాయని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తోందని, దాని ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. న్యాయ విద్యార్థులు ఉన్నత విలువలు, నైతిక ప్రమాణాలతో తమ వృత్తి జీవితంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుత ప్రపంచంలో పోషిస్తున్న పాత్రపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో వాణిజ్య రంగంలో వస్తున్న మార్పులు, వాటికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలోనూ మార్పులు అవసరమయ్యే పరిస్థితులపై మాట్లాడారు. కె.వి. రంగారెడ్డి లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, జాతీయ సెమినార్ నిర్వహణ ఉద్దేశ్యం, లక్ష్యాలను వివరించారు. మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా న్యాయ విద్యకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. సమాజంలో న్యాయవాదులకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, మర్యాదలు ఉన్నాయని తెలిపారు. వాటిని నిలబెట్టుకునే విధంగా న్యాయవాదులు తమ వృత్తిని బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. న్యాయ విద్యార్థులు చట్టపరమైన పరిజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలను పెంపొందించుకోవాలని కోరారు. రెండు రోజుల జాతీయ సెమినార్‌లో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు, న్యాయ విద్యార్థులు 70కి పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. వాణిజ్య చట్టాలు, సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ వాణిజ్యం తదితర విభిన్న అంశాలపై పరిశోధనా పత్రాలను సమర్పించి వాటిపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత కాలంలో వాణిజ్య రంగం, న్యాయ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం పరస్పరం ఎలా ప్రభావితం చేసుకుంటున్నాయనే అంశంపై సెమినార్‌లో లోతైన చర్చలు జరిగాయి. న్యాయ విద్యార్థులకు ఈ సదస్సు నూతన ఆలోచనలు, విజ్ఞానం, వృత్తిపరమైన అవగాహన కల్పించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కె.వి. రంగారెడ్డి లా కాలేజీ అధ్యక్షులు ప్రొఫెసర్ రాంచంద్రా రెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కె. వినోద్ రెడ్డి, ఎ.వి. కాలేజ్ కరస్పాండెంట్ డా. కె. గౌతమి, అధ్యాపక బృందం, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రతినిధులు, పరిశోధకులు, న్యాయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సెమినార్‌లో న్యాయ విద్య, వాణిజ్య చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై జరిగిన చర్చలు న్యాయ విద్యార్థులు, పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి.
న్యాయ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలతో రాణించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



