Sunday, September 13, 2026
E-PAPER
Homeజాతీయండీయూఎస్‌యూ ఎన్నికల్లో 
ఎస్‌ఎఫ్‌ఐ-ఏఐఎస్ఏ ఉమ్మడి ప్యానెల్‌

డీయూఎస్‌యూ ఎన్నికల్లో 
ఎస్‌ఎఫ్‌ఐ-ఏఐఎస్ఏ ఉమ్మడి ప్యానెల్‌

- Advertisement -

అధ్యక్షురాలిగా అనన్య రతూరి, కార్యదర్శిగా స్టాంజిన్‌ డెస్క్యాంగ్ పోటీ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

దేశవ్యాప్తంగా యువత ఉద్యమాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఏ సంయుక్త ప్యానెల్‌ బ‌రిలోకి దిగనుంది. విద్యార్థి కేంద్రిత, ప్రజాస్వామ్య రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు డబ్బు, కండబలం ఆధారిత రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా విద్యార్థి నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉమ్మడి ప్యానెల్‌ను బరిలోకి దింపుతున్నట్టు రెండు సంఘాలు ప్రకటించాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఏ ప్యానెల్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ఎస్‌ఎఫ్‌ఐ తరపున కార్యదర్శి అభ్యర్థిగా స్టాంజిన్‌ డెస్క్యాంగ్‌, సంయుక్త కార్యదర్శి అభ్యర్థిగా బి. పరిజాత్‌, ఏఐఏఎస్ త‌రఫున అధ్యక్ష అభ్యర్థిగా అనన్య రతూరి, ఉపాధ్యక్ష అభ్యర్థిగా అక్షత్‌ శిఖర్‌ను ప్రకటించింది.
అధ్యక్ష అభ్యర్థిగా అనన్య రతూరి
ఉత్తరాఖండ్‌కు చెందిన అనన్య రతూరి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సమస్యలపై చురుగ్గా ఉద్యమాలు నిర్వహించిన నాయకురాలిగా ఏఐఏఎస్‌ పేర్కొంది. ఐపీసీడబ్ల్యూ (ఇంద్రప్రస్థ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌)లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి ఆమె నాయకత్వం వహించారని తెలిపింది. ఎస్‌బీఎస్‌సీ ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ ఆమె పాల్గొన్నారని వెల్లడించింది. అందరికీ అందుబాటులో ఉండే నాణ్య‌మైన‌, సరసమైన విద్యను అందించే విశ్వవిద్యాలయం కోసం పోరాడతామని అనన్య ప్రకటించారు.

ఉపాధ్యక్షుడిగా అక్షత్‌ శిఖర్‌
అలహాబాద్‌కు చెందిన అక్షత్‌ శిఖర్‌ నీట్ యూజీ-2026 పరీక్షకు సిద్ధమయ్యారని, పరీక్షకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనల్లో పాల్గొన్నారని ఏఐఎస్ఏ తెలిపింది. జంతర్‌మంతర్‌ నిరసనల్లో పాల్గొన్న ఆయన అనంతరం ఏఐఎస్ఏ నిర్వహించిన 23 రోజుల నిరాహార దీక్షలోనూ చురుకుగా పాల్గొన్నారని వెల్లడించింది. మోతీలాల్‌ నెహ్రూ కళాశాలలో చేరిన అక్షత్‌, విద్యార్థి సమస్యలను విశ్వవిద్యాలయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో డీయూఎస్‌యూ ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తెలిపింది.
కార్యదర్శిగా స్టాంజిన్‌ డెస్క్యాంగ్‌
హిందూ కళాశాలలో మొదటి ఏడాది ఎంఎస్‌సీ (మ్యాథమెటిక్స్‌) చదువుతున్న స్టాంజిన్‌ డెస్క్యాంగ్‌ ఎస్‌ఎఫ్‌ఐ తరఫున కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. లడఖ్‌లోని లేహ్‌కు చెందిన ఆమె రామ్‌జాస్‌ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. డీయూఎస్‌యూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి లడాఖ్‌ విద్యార్థిగా ఆమెను ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది. రామ్‌జాస్‌ కళాశాలలో విద్యార్థులు, మహిళా అధ్యాపకులపై వేధింపుల ఆరోపణల నేపథ్యంలో బాధ్యత వహించాలని, సంబంధిత ప్రొఫెసర్‌ రాజీనామా చేయాలని కోరుతూ జరిగిన ఉద్యమంలో స్టాంజిన్‌ కీలకంగా వ్యవహరించారని ఎస్‌ఎఫ్‌ఐ తెలిపింది. వేధింపులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి తావులేని క్యాంపస్‌ కోసం పోరాడతామని ఆమె పేర్కొన్నారు.
సంయుక్త కార్యదర్శిగా బి. పరిజాత్‌
హన్స్‌రాజ్‌ కళాశాలలో మొదటి ఏడాది ఎంఏ ఇంగ్లీష్‌ చదువుతున్న బి. పరిజాత్‌ ఎస్‌ఎఫ్‌ఐ తరపున సంయుక్త కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -