ప్రభుత్వ ఆదేశాలతోనే దురుసు ప్రవర్తన
ఎన్‌డబ్ల్యూసీ, ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మెన్‌కు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
తమను అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం, శాసనసభ్యుల హక్కులకు భంగం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం డైరెక్షన్ లో మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఆరోపించింది. శుక్రవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్ డబ్ల్యూసీ), జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఎన్ డబ్ల్యూసీ చైర్‌పర్సన్ విజయ రహట్కర్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అనంతరం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయ భారతిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ… తమ హక్కులకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం వంటి అంశాలను కమిషన్ల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పోలీసులు చేస్తున్న దాడులపై స్పందించాల్సిన ప్రభుత్వ పెద్దలు మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనలకు సంబంధించిన అన్ని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు కోరారు. అలాగే కేసీఆర్‌కు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు.
అక్కా, చెల్లెళ్ల బాధపై స్పందించరా…?
‘అమ్మపై వ్యాఖ్యలకు బాధ కలిగిందన్న వారికి… అక్కా, చెల్లెళ్లకు జరిగిన అవమానంపై స్పందించరా..?’ అని స్పీకర్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే సబితా వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సభకు రానివ్వకుండా చేసేందుకే ఇదంతా జరిగిందని ఆరోపించారు. మంత్రులుగా పనిచేశామని, 20–30 ఏండ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నామని, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాంటి వారిని అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా అవమానకరంగా ఉందని ఆరోపించారు. చీర, జుట్టు పట్టుకుని లాగారని, ఇతర ఎమ్మెల్యేలను కింద పడేసి తొక్కారని ఆరోపించారు. అసెంబ్లీ వంటి పవిత్ర ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగి 100 గంటలు దాటినా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. మరోవైపు తమపైనే కేసులు నమోదు చేయడం రాజకీయ నాటకమని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతోనే ఢిల్లీకి వచ్చామని తెలిపారు.
‘మా సమస్యలపై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది’
రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును పూర్తి వివరాలతో జాతీయ కమిషన్లకు ఫిర్యాదు చేశామని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు, కష్టనష్టాలను భరించి రాజకీయంగా నిలదొక్కుకున్నామని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాల్సిన పరిస్థితుల నుంచి, తమపైనే జరిగిన దాడి గురించి మాట్లాడాల్సిన దుస్థితి తెలంగాణ ప్రభుత్వం తీసుకు రావడం అత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలో న్యాయం జరగదని భావించి ఢిల్లీకి వచ్చామని అని సునీత లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. దాడి చేయించడమే కాక, వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. కనీసం జరిగిన అవమానంపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, స్పీకర్ స్పందించి ఉంటే ఆయనకు చేతులెత్తి నమస్కరించేవాళ్లమని అన్నారు.
పోలీసులు మా హక్కులకు విఘాతం కలిగించారు
- Advertisement -
- Advertisement -



