యూఎఫ్‌బీయూ రాష్ట్ర కన్వీనర్
కె. ఆంజనేయ ప్రసాద్
ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలి
ప్రయివేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్
రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల బంద్.. సమ్మెలో ఉద్యోగులు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని యూఎఫ్‌బీయూ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ యూఎఫ్‌బీయూ పిలుపు మేరకు శుక్రవారం దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. అందులో భాగంగా రాష్ట్రంలో బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో ఉండటంలో కార్యకలాపాలు బంద్ అయ్యాయి. హైదరాబాద్ కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక ప్రధాన కార్యాలయం వద్ద ఆంజనేయ ప్రసాద్ అధ్యక్షతన సమ్మె నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడంతోపాటు బ్యాంకింగ్ రంగంలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, సిబ్బంది కొరతతో ఉన్నవారిపై పనిభారం పెరుగుతోందని, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను మరింత బలోపేతం చేయాలని, ప్రయివేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిపాదిత పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం ఉద్యోగుల మధ్య విభజనకు దారితీసే అవకాశం ఉందని, ఇలాంటి విధానాలను అమలు చేయవద్దన్నారు.
బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగులు, అధికారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐబీఈఏ జాతీయ అధ్యక్షుడు రాంబాబు, ఎన్‌సీబీఈ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, శాండిల్య, వెంకటరామయ్య, అర్జున్, శివమోహన్, రాజ్‌కుమార్, లింగారెడ్డి, శ్రీధర్, రవీంద్రనాథ్, శంకర్, సంబాద్‌ఖాన్, నాగేశ్వర్, కృష్ణారావు, సతీష్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
జిల్లాల్లో..
బ్యాంకు యూనియన్ ల సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఖమ్మంలో వైరా రోడ్ లోని ఎస్‌బీఐ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా తిరిగి ఎస్‌బీఐ వరకు ర్యాలీ నిర్వహించారు. 5 రోజుల పని దినాలను అమలు చేయాలనీ, పిఎల్ఐ అందరికీ అమలు చేయాలనీ నినదించారు. ఆ తర్వాత ఎస్‌బీఐ ఎదుట జరిగిన సభలో సీఐటీయూ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వర్రావు, తుమ్మ విష్ణువర్ధన్, ఉపాధ్యక్షులు ఎం.తిరుమలాచార్యులు పాల్గొని సమ్మెకు మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల, అధికారుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. సీఐటీయూ మీ పోరాటాలకు అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ నెల 28,29, 30 తేదీల్లో జరగబోయే సమ్మెకు కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. కొత్తగూడెంలో ఎస్‌బీఐ కార్యాలయం నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం ఎదుట బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రాములు, ఎల్ ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు రాజేశ్వర్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ తదితరులు మద్దతు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బ్యాంకు సమ్మె జరిగింది.
హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో సమ్మె విజయవంతమైందని ఎస్‌బీఐ అధికారుల సంఘం వై. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎస్‌బీఐ ప్రధాన శాఖ వద్ద వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా అశోక్ జంక్షన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగం స్థంభించింది. బ్యాంక్ ఉద్యోగులు, సిబ్బంది తమ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ధర్నాచౌక్ నుంచి ఎల్లమ్మగుట్ట చౌరస్తా వరకు.. అక్కడి నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



