Monday, June 16, 2025
E-PAPER
Homeజాతీయంమానవజాతి ఆయుధం 'మార్క్సిజం'

మానవజాతి ఆయుధం ‘మార్క్సిజం’

- Advertisement -

– ‘సిందూరం’ పుస్తకావిష్కరణ సభలో ప్రసాదమూర్తి
కర్నూలు :
ఆర్థిక అసమానతలు, దోపిడీ ఉన్నంతకాలం మార్క్సిజం ఉంటుందని, మానవజాతికి మార్క్సిజం ఆయుధమని ప్రముఖ కవి, సీనియర్‌ జర్నలిస్టు డాక్టర్‌ బి ప్రసాదమూర్తి అన్నారు. కర్నూలులోని కార్మిక కర్షక భవన్‌లో ఉన్నం వెంకటేశ్వర్లు – ఉష రాసిన ‘సిందూరం’ పుస్తకావిష్కరణ సభ సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సభలో ప్రసాదమూర్తి మాట్లాడుతూ మార్క్సిజం అన్నది సైన్స్‌ అని, తాత్కాలిక అపజయాలు ఉన్నా చివరకు విజేతగా నిలుస్తుందని తెలిపారు. కార్ల్‌మార్క్స్‌ రాసిన పెట్టుబడిదారి పుస్తకాన్ని సిందూరం పేరుతో కవిత్వంగా మలచడం అరుదైన విషయమని అన్నారు. మార్క్సిజాన్ని వివరించడానికి ప్రపంచ వ్యాప్తంగా వేల గ్రంథాలు ప్రపంచ భాషల్లో వచ్చాయని తెలిపారు. సిందూరం పుస్తకం సరళ భాషలో కూడా పెట్టుబడి గూర్చి రాయవచ్చని నిరూపించారన్నారు. సభాధ్యక్షులు జె.రఘుబాబు మాట్లాడుతూ మార్క్సిజం ప్రజల జీవన విధానాల్ని మరింత మెరుగ్గా మారుస్తుందని తెలిపారు. అసమానతలు, అంతరాలు లేని మరో ప్రపంచమే మార్క్సిజమని అన్నారు. ప్రముఖ కవి వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈ పెట్టుబడిదారీ సమాజంలో మార్క్సిజాన్ని సామాన్య జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ.. కవులు, కళాకారులు సామాజిక జీవిత సత్యాలను తమ సాహితీ ప్రక్రియలో రాయాలని సూచించారు. సిందూరంలో పెత్తందారీ అవినీతి వ్యవస్థలను, దోపిడీని నిలదీసిందని తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిత్వాన్ని శ్రమైక జీవన సౌందర్యాన్ని పెంపొందించేలా సిందూరం పుస్తకంలో కవిత్వీకరించారని అన్నారు. ప్రజాశక్తి కర్నూలు డెస్క్‌ ఇన్‌చార్జ్‌ పానుగంటి చంద్రయ్య మాట్లాడుతూ సిందూరం కవితా సంపుటిలో సరళమైన బాషలో, అర్థవంతమైన పదాల పొందికతో అందరినీ చదివించ దగినదిగా ఉందని చెప్పారు. సభలో సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్‌ మాట్లాడుతూ మార్క్సిజం పునాదులపైన దేశ భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా మహాకవి శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ శ్రీ చిత్రపటానికి పూలమాల వేసి అతిథులు జోహార్లు అర్పించారు. పలువురు కవులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -