విత్తనాలకు ఎలాంటి కొరత లేదు

– రైతులు ఆందోళన చెందొద్దు 
– నేటి నుండి విధిగా ఆకస్మిక తనిఖీలు 

-రైతులు డీలర్ల నుండి తప్పక రసీదు పొందాలి
-డీలర్లు అవకతవకలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు
-50 ప్యాకెట్ల కంటే ఎక్కువగా విత్తనాలు కొనుగోలు చేసిన రైతు వివరాలు సేకరించాలి
-జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్ : జిల్లాలోని పత్తి ఇతర పంటల విత్తనాలకు ఇలాంటి కొరతలేదని రైతులకు కావలసిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ హరిచందన  దాసరి తెలిపారు. గురువారం ఏడిఏ, ఎంఏఓ, ఏఈఓ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి  తగు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో డీలర్ల నుండి తప్పక రసీదు పొందాలని తెలిపారు. రైతులకు ఏ విధమైన ఇబ్బంది కలిగిన సంబంధిత వ్యవసాయ శాఖ అధికారిని, లేదా సిబ్బందిని సంప్రదించాలని  పేర్కొన్నారు. ఎవరైనా డీలర్లు అవకతవకలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు మండల వ్యవసాయ అధికారి తన పరిధిలో ఉన్న విత్తన డీలర్ షాపులను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్, గ్రౌండ్ స్టాక్ నిలువల ధ్రువీకరణ చేయాలని సూచించారు. 50 ప్యాకెట్ల కంటే ఎక్కువగా విత్తనాలు కొనుగోలు చేసిన రైతు వివరాలు సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. బిజీ టు ప్రైవేట్ హైబ్రిడ్ కూడా ఒకే రకమైన నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటాయి. అందువల్ల రైతులు అందుబాటులో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయాలని, రైతులకు  రైతు వేదిక ద్వారా సమావేశపరచి అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి, మండల స్థాయిలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో విత్తన తనిఖీ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని నేటి నుండి విధిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వాయించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పచ్చి రొట్టె విత్తనాలు  జిల్లాకు సరిపడా నిలువలు ఉన్నాయి.  రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. అంతేకాకుండా  అదనంగా పచ్చి రొట్టె విత్తనాలు  మంజూరు చేయించామని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో విత్తనం సెల్  ఏర్పాటు చేశామని, ఇబ్బంది ఉన్న వారు  7288800023  ను సంప్రదించాలని తెలిపారు.
పంట సాగు…  విత్తనాల వివరాలు
వానాకాలం 2024 కాలానికి సంబంధించి పంట సాగు విస్తీర్ణం, అవసరమైన విత్తనాలు, అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పత్తి 568735 ఎకరాలలో సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అందుకోసం 1421837 ప్యాకెట్ల విత్తనాలు అవసరం కాగా ప్రైవేట్ విత్తన విక్రయ కేంద్రాల ద్వారా 598746 ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.వరి పంటకు సంబంధించి 508444 ఎకరాలలో సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా 122533 ప్యాకెట్ల విత్తనాలను సహకార విత్తన విక్రయ కేంద్రాలలో 631 ప్యాకెట్లు అందుబాటులో ఉండగా ప్రైవేట్ విక్రయ కేంద్రాలలో 7201 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి.కందులు 3940 ఎకరాలు, అవసరమైన విత్తనాలు 158 క్వింటాళ్లు కాగా ప్రైవేట్ విక్రయ కేంద్రాలలో 20 క్వింటాళ్లు   అందుబాటులో ఉన్నాయి. జీలుగా కు సంబంధించి 29583 ఎకరాలలో సాగు అంచనా వేయగా 3550  విత్తనాలు అవసరం అవుతాయి. అందుకుగాను సహకార విత్తన విక్రయ కేంద్రాలలో 2040 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. జనుముకు సంబంధించి 5800 ఎకరాలలో అంచనా వేయగా 696 టన్నుల విత్తనాలు అవసరం కాగా సహకార విత్తన విగ్రహ కేంద్రాల ద్వారా 664 కింటా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా పప్పు దినుసులకు సంబంధించి 1578 ఎకరాలలో సాగు అంచనా వేయగా 126.5 క్వింటాల విత్తనాలు అవసరం కాగా సహకార విత్తన విక్రయ కేంద్రాలలో 4 క్వింటాళ్లు,  ప్రైవేటు విత్తన విక్రయ కేంద్రాలలో 40 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
Spread the love