బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలి: ఎంపీడీఓ

– బడి తెరిచిన రోజే యూనిఫాం అందజేస్తాం – సెర్ప్ ఏపీఎం వెంకటేశ్వరరెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
బడి ఈడు పిల్లలందరిని ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని అందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని యం.పి.డి.ఒ శ్రీనివాస్ అన్నారు.  శుక్రవారం స్థానిక మండల పరిషత్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన బడిబాట మండలస్థాయి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు ప్రతిరోజు ప్రతి హేబిటేషన్ లోనూ బడిబాట కార్యక్రమాలను నిర్వహించాలని అంగన్వాడీ కార్యకర్తలు, ఐ.కె.పి. వి.ఒలు, ప్రధానోపాధ్యాయులు, సి.ఆర్.పిలు సమన్వయంతో నిర్వహించాలని అన్నారు. కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు నివేదికలను పంపాలని అన్నారు. విద్యాశాఖ మండల నోడల్ అధికారి, మామిళ్ళ వారి గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు   ప్రసాదరావు బడిబాట షెడ్యూల్ ను వివరించారు. సెర్ప్ ఏ.పి.యం. వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ  పాఠశాలలు తెరిచే నాటికి యూనిఫాం అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.  ఈ సందర్భంగా అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.హరిత ముద్రించిన బడిబాట కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు, సి.ఆర్.పిలు, ఐ.సి.డి.యస్ సూపర్వైజర్లు, ఐ.కె.పి  సి.సిలు పాల్గొన్నారు.
Spread the love