నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఐఎంజీ భారత్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లో తనను ప్రతివాదిగా చేయాలని మాజీ మంత్రి పి.రాములు ఇంప్లిడ్ పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరం లేదన్నారు. స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఐఎంజీ భారత అకడమీస్ ప్రయివేట్ లిమిటెడ్‌కు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమి కేటాయించింది. పలు స్టేడియాలను కూడా కేటాయించింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ విశ్రాంత సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఇతరులు సుమారు 12 ఏండ్ల క్రితం పిల్స్ వేశారు. వీటిని చీఫ్ జస్టిస్ బెంచ్ శుక్రవారం విచారించింది. విచారణను జులై 2కు వాయిదా వేసింది.
కేంద్రానికి ఎదురుదెబ్బ
విదేశాలకు చెందిన వివిధ రకాల పెంపుడు కుక్కల దిగుమతిని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. స్టే మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విచారణను జులై 5కి వాయిదా వేస్తూ జస్టిస్ విజరుసేన్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు కుక్కల పెంపకం దారుల హక్కులను హరించేలా ఉన్నాయంటూ పిటిషన్లపై విచారణను వాయిదా వేసింది.
రమ్మీ ఆడేందుకు అనుమతినివ్వండి
ఎమ్మెల్యేల కాలనీలోని రిక్రియేషన్ సెంటర్లో 13 ముక్కల రమ్మీ/సిండికేట్ గేమ్‌ను అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీన్ని చీఫ్ జస్టిస్ బెంచ్ శుక్రవారం విచారించింది. చట్టసభ సభ్యులు/మాజీలు, కాంట్రాక్టర్లు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు తమ అసోసియేషన్‌లో ఉన్నారని పిటిషనర్ తెలిపారు.
రమ్మీ నైపుణ్యంతో కూడిన ఆటల పరిధిలోకి రాదని పోలీసులు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇది సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకమన్నారు. డీజిపి, హౌం శాఖ, లా సెక్రటరీ ఇతరులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కేంద్రానికి ఆదేశం
ఇంటర్లో ఫెయిల్ అయ్యాయనీ, అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసిన తనకు జెఈఈలో ర్యాంక్ లభించిన కారణంగా ఇంటర్ సర్టిఫికెట్‌ను సమర్పించేందుకు సమయం కావాలని ఖమ్మం జిల్లాకు చెందిన భూక్యా లోహిత్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. పిటిషనర్ ఈనెల 7న సమర్పించిన వినతి పత్రంపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. జేఈఈలో ర్యాంకు వచ్చిందనీ, ఇంటర్ తప్పిపోవడంతో అడ్వాన్స్ పరీక్షలు రాశాననీ, ఫలితాలు వచ్చాక ఇంటర్ సర్టిఫికెట్ సమర్పించడానికి అనుమతించేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. కేంద్ర ప్రభుత్వ వివరణ నిమిత్తం విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.