ఈ మధ్యన సోషల్ మీడియాలో కనిపించిన ఓ పోస్ట్ నన్ను బాగా ఆకట్టుకుంది. ‘బిచ్చగాళ్లకు డబ్బులివ్వకండి. ఆహారం బట్టలు మాత్రమే ఇవ్వండి. డబ్బులిస్తే బిచ్చగాళ్లు పెరిగిపోతారు. అనాధలు, దురలవాట్లకు బానిసలైన వారిని చేరదీసి బిచ్చగాళ్లుగా తయారు చేస్తున్నారు. ఇలాంటి ముఠాలు దేశ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను కొనసాగిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త…’ అని ఆ పోస్ట్ సారాంశం. ‘ముంబాయి, ఢిల్లీ లాంటి మహా నగరా ల్లో ఈ ప్రచారం ఊపందుకుంది. మీరు కూడా సామాజిక బాధ్యతగా మరింతగా ప్రచారంలోకి తెచ్చి బిచ్చగాళ్లను తయారు చేసే ముఠాల ఆట కట్టించే ఉద్య మంలో బాగస్వామ్యంకండి’అనే ఈ పోస్ట్ ఆసక్తిగా, ఆలోచన రేకెత్తించేదిగా ఉంది. అదే సందర్భంలో నా మస్తిష్కంలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. బిచ్చగాళ్లేందుకు తయారవు తున్నారు? నిజంగానే వారిని తయారు చేస్తున్నారా? విధి వంచితులై తయారవుతున్నారా? ఈ సమస్య పట్ల క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నాకనిపించింది. గత బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో జైళ్ల శాఖ డీజీగా ఉన్న వినయ కుమార్ సింగ్ అనే ఓ ఐపీఎస్ అధికారి హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల పునరావాసానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. జైళ్ల శాఖ తరపున ఆనందా శ్రమం పెట్టి వారిని చేరదీసారు. కుటుంబాలు తమకు భారమయ్యారని నెట్టేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని తిరిగి ఇండ్లకు పంపించారు. ముక్కు సూటిగా ఉండే ఆయన్ను గత సర్కార్ భరించలేక.. స్వతహాగా వీఆర్‌ఎస్ తీసుకుని వెళ్లేలా చేసింది. ఆ తర్వాత ఆయన ప్రారంభించిన ఆనందాశ్రమం ఆగిపోయింది. నగరంలోని రోడ్లపై బిచ్చగాళ్ల తాకిడి మళ్లీ ఎక్కు వైంది. కారణం ఏదైనా కాని, ఆ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఎవరిది. సమాజానిదా? ప్రభుత్వానిదా? తప్పెవరిది? ఆలోచించాల్సిన అవసరం ఉంది.
– ఊరగొండ మల్లేశం