కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ..!

– ఉత్తర్వులు అమలు చేయని డీడీ
– అనారోగ్య కారణాలు చెప్పి  నల్లగొండలో వార్డెన్ తిష్ట 
– అదనపు బాధ్యతలను అప్పగించడం సమంజసమేనా! 
– ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఫిర్యాదు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
కలెక్టర్ ఆదేశాలను అధికార  యంత్రాంగం బేకాతరు చేసింది. డిప్యూటేషన్ ను రద్దు చేయకుండా ఉత్తర్వులను నిర్లక్ష్యం చేస్తోంది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేస్తూ పోతే మేము దాన్ని అమలు చేయాలా? అన్న రేంజ్ లో సహాయ నిరాకరణ జరిగింది. నల్లగొండ జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ కు సంబంధించి ఓ వార్డెన్  వ్యవహారంలో అచ్చంగా ఇదే జరిగింది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ వార్డెన్ డిప్యూటేషన్ రద్దు చేస్తూ తనను వెనక్కి పంపించాలని స్వయంగా డిడి కి ఆదేశాలు జారీ చేసినా అమలు చేయకపోవడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి.
అసలు విషయం ఇదే..
సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో సూర్యాపేట జిల్లా మఠంపల్లి లోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో వార్డెన్ గా విధులు నిర్వహించే ఓ వార్డెన్ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉండాలనే ఉద్దేశంతో అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ నల్లగొండ జిల్లాకు డిప్యూటేషన్ పై 2018 లో వచ్చి తిష్ట వేశారు. అతనికి మొదటగా నిడమనూరు లో పోస్టింగ్ ఇచ్చారు. అనతి కాలంలోనే నల్లగొండ జిల్లా  తిప్పర్తి మండల కేంద్రంలోని బాయ్స్ హాస్టల్ అదనపు  బాధ్యతలను అప్పగించారు. ఇదే కాకుండా నల్లగొండ జిల్లా కేంద్రంలోని  మరో బాలుర కళాశాల హాస్టల్,  బాధ్యతలను కూడా అతనికి అప్పగించారు. ఇదే సమయంలో మరొక హాస్టల్ వార్డెన్ సెలవు పై వెళ్లడంతో ఆ హాస్టల్ బాధ్యతలను కూడా సదరు వార్డెన్ కి అప్పగించారు. ఇదే కాకుండా గత సంవత్సరం బాలుర బి1 హాస్టల్ బాధ్యతలను కూడా అతనికి అప్పగించారు. మొత్తంగా అతను విధులు నిర్వహించే హాస్టల్ తో కలిపి మరో నాలుగు హాస్టళ్లకు అదనంగా బాధ్యతలు అప్పగించారు.. నల్లగొండ జిల్లా సంక్షేమ శాఖ అధికారులు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా .. ఆరోగ్యం బాలేదని మెడికల్ గ్రౌండ్స్ మీద డిప్యూటేషన్ పై నల్లగొండకు వచ్చిన  వార్డెన్ 5 హాస్టల్ల బాధ్యతలను తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారా అనేది అసలు ప్రశ్న. అసలు సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అధికారులు ఏ ఉద్దేశం తో అతనికి అదనంగా హాస్టల్ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల భవిష్యత్తు అంటే అధికారులకు పట్టింపు లేదా అంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనేకమార్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలను అందజేశారు. ఒత్తిడి ఎక్కువ కావడంతో సాంఘిక సంక్షేమ శాఖ డిడి  డిప్యూటేషన్ పై వచ్చిన వార్డెన్ చేస్తున్న ఐదు హాస్టల్లో ముడు హాస్టలను ఇతర వార్డెన్ లకు అప్పగించారు. అందులో రెండు హాస్టలను ఇతర వార్డెన్ లకు అప్పగించగా మరొక హాస్టల్ ఇంచార్జి బాధ్యతలను తీసుకోవడానికి ఓ వార్డెన్ నిరాకరించింది. దానికి గల ప్రధాన కారణం తాను చార్జి తీసుకునే రోజే ఆ హాస్టల్లో ఓ విద్యార్థి హత్యకు గురికావడం. హాస్టల్ నుండి బయటికి వెళ్లిన విద్యార్థి హత్యకు గురికావడంతో ఆ విషయం అప్పట్లో చర్చనీయాంశం అయింది. దీంతో హాస్టల్ ను తిరస్కరించిందని పలువురు పేర్కొన్నారు.
కలెక్టర్ ఉత్తర్వుల్లో ఏముంది.? 
ఇటీవల కాలంలోనే బదిలీపై వెళ్లిన గత సూర్యాపేట జిల్ల కలెక్టర్ వెంకట్రావు వార్డెన్ డిప్యూటేషన్ ను  రద్దు చేయాలని, వెంటనే వెనక్కి పంపించాలని సాంఘిక సంక్షేమ శాఖ  డిడి కి  గత ఏడాది అక్టోబర్ 21న ఆదేశాలను జారీ చేశారు. అయినా కూడా డిడి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. ఇక్కడే కొనసాగించడం
గమనార్హం.
చేతులు మారిన రూపాయలు..
డిప్యూటేషన్ పై వచ్చిన వార్డెన్ తన డిప్యూటేషన్ నిలుపుదల చేయించుకోవడం కోసం పడుతున్న ఆరాటం అంత ఇంత కాదు. డిప్యూటేషన్ రద్దునూ క్యాన్సిల్ చేయడం కోసం సంబంధిత వార్డెన్ భారీగానే ముడుపులు చెల్లించినట్లు సమాచారం. సంబంధిత శాఖ కు చెందిన ఉద్యోగుల తోపాటు, యూనియన్ నాయకుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందువల్లనే సంబంధిత శాఖకు చెందిన అధికారులు వార్డెన్ డిప్యూటేషన్ ను రద్దు చేయకుండా కాలయాపన చేస్తూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు  ఆరోపిస్తున్నారు.  అనారోగ్య రీత్యా నల్లగొండకు వచ్చిన వార్డెన్ నిడమనూరులో విధులు నిర్వహించకుండా జిల్లా కేంద్రంలో ఉంటూ విద్యార్థుల ను పట్టించుకోకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్య రీత్యా జిల్లాకు వచ్చిన వార్డెన్ నిడమనూరులో స్థానికంగా ఉండకుండా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉంటూ యూనియన్ నాయకులతో కలిసి తిరుగుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరొక విశేషం ఏంటటే అనారోగ్యంగా ఉన్న వార్డెన్ జిల్లా కేంద్రం లో ఉంటూ నల్లగొండ పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే నిడమనూరులో విధులను నిర్వహించడం సాధ్యమేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఎనిమిది నెలలు కావస్తున్న వెనక్కి పంపలే..
సూర్యాపేట జిల్లా గత కలెక్టర్ వెంకట్రావు డిప్యూటేషన్ వెంటనే రద్దుచేసి వార్డెన్ వెనక్కి పంపాలని డీడీకి లేఖ రాసి 8 నెలలో కావస్తున్న నేటికీ వెనక్కి పంపలేదు. సాంఘిక సంక్షేమ శాఖ డిడి వార్డెన్ ను వెనక పంపు పోవడానికి గల కారణం ఏంటో అర్థం కాని ప్రశ్న. అకాడమిక్ ఇయర్ మధ్యలో రిలీవ్ చేస్తే విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుందని సాకు చూపడమే కాకుండా నల్లగొండ జిల్లా కలెక్టర్ విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత వార్డెన్ ను రిలీవ్ చేయమని చెప్పారని, ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తామని  సూర్యాపేట కలెక్టర్ కు చెప్పినట్లు తెలిసింది. గత ఏడాద విద్యా సంవత్సరం పూర్తయి, కొత్త విద్యా సంవత్సరం ఆరంభమైంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారుగా 20 రోజులు కావస్తున్న నేటికీ డిప్యూటేషన్ ఊసే లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు డిప్టేషన్ రద్దు చేయకపోవడానికి చేతులు మారిన రూపాయలే కారణంగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా గతంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలు అమలయేలా నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూర్యాపేట నుండి డిప్యూటేషన్ పై వచ్చిన వార్డెన్ డిప్యూటేషన్ రద్దు చేయాలని, వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించాలని, హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని, విద్యావేత్తలు, విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Spread the love