ఎస్సై ఆత్మహత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..

– దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట లో పనిచేస్తున్న దళిత ఎస్సై శ్రీను ఆత్మహత్యపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య డిమాండ్ చేశారు. ఆదివారం అశ్వారావుపేట లో అంబేద్కర్ విగ్రహం ముందు దళిత ఎస్సై ఆత్మహత్యకు నిరసనగా దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే,సాటి పోలీసు నే కుల వివక్షతో వేధించి ఆత్మహత్య చేసుకునే లాగా చేయడం  చాలా దారుణం అన్నారు. ఎస్సై దళితుడు కాబట్టే కిందిస్థాయి సిబ్బంది,పై స్థాయి అధికారి అగ్ర కులాలు అయి ఎస్సై ని వేధింపులకు గురి చేశారు అని అన్నారు.ఎస్సై విధులకు ఆటంకాలు కలిగిస్తూ మానసికంగా వేధింపులకు గురి చేయటం వలనే ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసారు. తనకు జరుగుతున్న వేధింపులు గురించి పై అధికారులకు విన్నవించినా పై అధికారులు కూడా పట్టించుకోక పోవడం వలనే ఒక నిజాయితీ పోలీస్ అధికారిని సమాజం కోల్పోయిందని తెలిపారు. తక్షణం దళిత ఎస్సై ఆత్మహత్యకు  కారకులైన వారిని అరెస్టు చేయాలి. అదేవిధంగా తనకు జరుగుతున్న వేధింపులు గురించి పై అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పై అధికారులు పై కూడా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి తగరం రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కొలికిపోగు ధర్మ,గుర్రాల శ్రీనివాసరావు, దళిత యువజన విభాగం అధ్యక్షుడు గంధం బోసు, స్వారో జిల్లా నాయకులు కలపాల మంగ రాజు,తగరం రామ్ నివాస్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కంటే కేశవ్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love