Sunday, June 29, 2025
E-PAPER
Homeసోపతిసినిమోడి కష్టాన్ని తెలిపిన పాట

సినిమోడి కష్టాన్ని తెలిపిన పాట

- Advertisement -

సినిమా వాళ్ళ జీవితాలు, కష్టాలు వర్ణనాతీతం. సినిమా తీయాలని, కథ రాయాలని, పాటలు రాయాలని, మాటలు రాయాలని, సింగర్‌ అవ్వాలని.. ఇలా ఎన్నెన్నో ఆశలు.. ఆశయాలు. అలాంటి సినిమా వాడి కష్టం ఫలించి అదృష్టం కలిసివస్తే ఇక తిరుగుండదు. చరిత్ర పుటల్లో పేరు స్థిరంగా నిలిచిపోతుంది. అలాంటి సినిమావాడి జీవితాన్ని వివరిస్తూ పి.బి. బాబు ఒక పాట రాశాడు. 2024 లో కారాబూంది టీమ్‌ వారి దర్శకత్వంలో వచ్చిన ‘హతవిధి’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.

సినిమా అంటేనే ఓ వింత ప్రపంచం. ఎన్నో వింతలు, విశేషాలు చూపిస్తుంటుంది. అందులో ఏది నిజమో? ఏది అబద్ధమో? తెలుసుకోలేని పరిస్థితిలో, అర్థం కాని అయోమయస్థితిలో ఉంటాం మనం. సినిమాని, సినిమా వాళ్ళని తొందరగా నమ్మలేమన్న సత్యం కూడా ఒకటుంది. సినీరంగంలో ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. ఓపికతో ప్రయాణం చేయాలి. ఫలితం ఎన్నో ఏళ్ళకు గాని దొరకదు. ఒక్కోసారి అదృష్టం తొందరగానే వరిస్తుంది. అలాంటి అదృష్టం వరించిన సినీకళాకారులను గురించి ఈ పాట వివరిస్తుంది.


సినిమాపరంగా చూస్తే.. ఎన్నో కష్టాలు పడుతూ పడుతూ ప్రయాణిస్తుంటారు కొందరు కళాకారులు. వాళ్ళకి అనుకున్న సక్సెస్‌ దక్కే సమయం దగ్గర పడుతుంది. ఆ కష్టాన్ని గురించి, సక్సెస్‌ ను గురించి ఈ పాటలో చెప్పబడింది. పి.బి.బాబు అద్భుతంగా రాశాడీ పాటను.
సినిమా అంటే ఏంటి అసలు? మనకు అర్థమవ్వని మాయల ప్రపంచం. ఈ సినిమా మనకు ఎన్నో ఆశలు కలిగిస్తుంది. ఊహలతోనే ఉక్కిరిబిక్కిరయ్యేలా చేస్తుంది. ఊహలు నిజమైతే మంచిదే. కాని కొన్నిసార్లు ఊహల్లోనే, ఉహలతోనే బతికేలా చేస్తుంది. మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. కొన్నిసార్లు మనం అనుకున్నదానికంటే ఎక్కువగానే సక్సెస్‌ సాధిస్తాం. అనుకోనిది కూడా మన కాళ్ళకు తగిలి, విజయమై చెంత వాలుతుంది. కొన్నిసార్లు అంతా తలకిందులవుతుంది. ఏది ఎలా జరుగుతుందో, జరగబోతోందో మనం చెప్పలేం కదా.


విధి చాలా బలమైనది. విధి ఆడే వింత నాటకం జోరుగా, హుషారుగా మొదలయిందిక్కడ. సినిమావాడి నాటకం, విధి ఆడే నాటకం రెండూ వేరు వేరు. విధి నాటకంతో సినిమా నాటకాన్ని పోల్చి చూడలేం. సినిమా బతుకు తెరువు కోసం, కళ కోసం, పేరు కోసం.
కాని విధి ఆడే ఆటలో అందరి జీవితాలు పావులే అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. పైనున్న భగవంతుడి ఇంద్రజాలం, సినిమావాడి మాయాజాలం రెండూ చెప్పడం కష్టమే. ఏది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఓ కొత్త బాగోతం షురూ అయింది. ఏదో సాధించాలని, ఏదో ట్రెండ్‌ సెట్‌ చేయాలని వాళ్ళు రాత్రిపగలూ తేడా లేకుండా కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టాన్ని ఈ పాటలో కళ్ళకు కట్టినట్లు చూపించాడు పి.బి.బాబు.
కళాకారులు ఏ తోక తొక్కారో, ఏ నోము నోచారో వాళ్ళ తలరాత మొత్తం మారిపోయింది. ఇన్నాళ్ళ వాళ్ళ కర్మ అంతా పోయింది. కలల సాగరాన్ని ఈదుతున్నారు వాళ్ళు. నిన్నటి రోజుని తలుచుకోకుండా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ గతం గతః. ఈరోజేం చేయాలో అదే వాళ్ళ మనసుల్లో ఉంది. వాళ్ళ భవిష్యత్తు కొత్తగా రాసుకోవాలన్న తపనతో, ఆశయంతో ఉన్నారు. పేరుకోసం, డబ్బుకోసం ఎక్కువ ఆశలు పడితే చీకటి రంగుల్లో ఉన్న నల్లటి ఉచ్చు మెడకు బిగుసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కళనే జీవితంగా సాగాలి. డబ్బు వచ్చేటప్పుడు వస్తుంది. పేరు రావాల్సినపుడే వస్తుంది. కష్టాన్ని కక్కలేక, మింగలేక మనం ప్రయాణం చేస్తుంటే విధి పట్టుబట్టి మనకు ఒక సినిమా చూపిస్తోందని వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. అందరికీ మనం సినిమా చూపిద్దామనుకుంటాం కాని, విధి కూడా మనకు ఒక వింత సినిమా చూపిస్తుందని ఊహించం. ఆడలేకనో, ఆగలేకనో వెండితెర వెనుకన దాగి ఉండి బలైపోతున్న జీవితాలు ఎన్నెన్నో ఉన్నాయని అంటున్నాడు కవి.
సినిమా వాళ్ళు జీవితాల్ని పణంగా పెట్టి వెండితెరపై యుద్ధం చేసే వీరులు. అలాంటి వారి జీవిత కథలకు పాత్రలు వేసి, పద్మవ్యూహం అనే దారిలో నల్లటి కంటిచూపుతో తెల్లనైన వెలుగు కోసం విక్రమార్కునిలాగా సాధన కొనసాగుతోంది. కొనసాగుతూనే ఉంటుందని చెబుతున్నాడిక్కడ.
పాట:
అరె..ఏందిది ఏందిది సినిమా/ ఆశలెన్నొ లేపుతుంది కదమ్మా/ ఊహలోనే ఉంచుతాంది దీనమ్మా/ అనుకున్నదొక్కటాయే జరిగేది ఇంకోటాయే/ విధి ఆడే వింతనాటకం ఇంత జోరుగా మొదలాయే/ సినిమోడి మాయాజాలం పైనోడి ఇంద్రజాలం/ ఇక షురువై జూపించిందా ఇంతటి బాగోతం/ ఏ తోక తొక్కినారో ఏ టైం నోచినారో/ విధి నేడు అంతు జూసి వీరికో సినిమా చూపించిందా/ ఎన్నాశలెట్టుకున్నారో ఎన్నేళ్ళు కట్టపడ్డారో/ ఇక దీంతో అంతా మారి సిక్కుల కర్మ దూకేసిందా/ షాట్‌ రెడీ మచ్చా../ కన్న కలల సాగరాన్ని నిన్ననొదిలి ఈదుతున్నా/ పేరు తెచ్చి పైసలిచ్చే పేరాశల జాడకెళ్తే చీకటున్న నల్లటుచ్చు మెడకు చిక్కి ముడిల బిగిసే/ కక్కలేక మింగలేక పట్టుపట్టి ఆడిస్తుంటే/ ఆడలేక ఆగిపోక వెండితెరకు వెనుకదాగి/ వీరులన్న విలువమరిచి వీరికథకు పాత్రలేసి/ పద్మవ్యూహ దారిలో నల్ల కంటిచూపుతోన/ తెల్లనైన వెలుగు కోసం విక్రమార్క సాధనాయే.
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -