ఎంట్రీ- ఎగ్జిట్‌ పై ఎన్‌ హెచ్‌ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

Navatelangana,Telugu News,Telangana,Khammamనవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం టూ దేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు ధంసలాపురం వద్ద ఎంట్రీ ఎగ్జిట్‌ పై నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సమీక్షించారు. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌, ఇతర అధికారులతో డిజైన్స్‌పై చర్చించారు. అధికారులు మంత్రికి రెండు డిజైన్లు సమర్పించారు. వీటిపై మంత్రి స్పందిస్తూ రైతులు ఎక్కువగా నష్టపోకుండా తక్కువ భూసేకరణ ఉండే డిజైన్‌ పరిశీలించాల్సిందిగా సూచించారు. అటువంటి డిజైన్‌ ను ఆమోదించాల్సిందిగా ఉన్నతాధికారులకు సూచన చేశారు. త్వరగా భూ సేకరణ చేసి నేషనల్‌ హైవే అధికారులకు అప్పగించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ను కోరారు. అలాగే ధంసలాపురం హైవే ఎంట్రీ ఎగ్జిట్‌ డిజైన్స్‌ త్వరగా ఆమోదం పొందేలా కషి చేయాలి అన్నారు. ఖమ్మం – యదేవరపల్లి హైవే మిగులు పనులు పూర్తయ్యేలోపు ధంసలాపురం వద్ద ప్రవేశం నిష్క్రమణ వంతెన పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్‌ హెచ్‌ ఏఐ అధికారులను ఆదేశించారు.
ఎన్‌హెచ్‌ 365ఏపై అధికారులకు మంత్రి లేఖ
మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని జాతీయ రహదారి 365ఏ వెంకటాపురం- ముదిగొండ నుంచి వెళ్తుందని, ఇక్కడ అనేక గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్న నేపథ్యంలో దీనిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ఎన్‌ హెచ్‌ ఏ ఐ హైదరాబాద్‌ రీజనల్‌ ఆఫీసర్‌ రజాక్‌ కు మంత్రి లేఖ రాశారు. ఈ మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. 8 కిలోమీటర్ల వ్యవధిలో ఐదు ప్రమాద హెచ్చరిక బోర్డులను పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ ప్రమాద స్థలాలను సరిచేసి, నాలుగు లైన్ల రోడ్డు పూర్తయిన తర్వాత రాష్ట్ర రోడ్డు భవనాల శాఖకు దీనిని అప్పగించాల్సిందిగా కోరారు.

Spread the love