కొన్ని పేజీలు చదవక ముందు ఒక మనిషిగా.. చదివాక వేరే మనిషిగా రూపాంతరం చెందడమే గొప్ప పుస్తకానికి ఉన్న లక్షణం. ఒక పుస్తకం ఒక అరిస్టాటిల్ లాగానో, ఇంకో తత్వవేత్త లాగానో ఏదన్నా నేర్పితే అది మరపురాని పుస్తకమే. అది అన్ని పుస్తకాలకూ సాధ్యం కాదు. అలాంటి పుస్తకమే స్పార్టకస్ నవల. హౌవర్డ్ ఫ్రాస్ట్ రాసిన చారిత్రక నవల స్పార్టకస్.
ఇది నేను పత్రికా రంగంలోకి అడుగుపెట్టిన రెండు, మూడు ఏళ్లలో చదివిన పుస్తకాల్లో ఒకటి. క్లాసిక్స్ లిస్ట్ ఒకటి పెట్టుకొని చదువుతున్నాను. చివరికి మిగిలేది, అమ్మ, రూట్స్, తో పాటు ఇది. పాఠకుడిగా మన మనసును కదిలించే పుస్తకాలు వేరు. వ్యక్తిగా మనల్ని ఎవాల్వ్ చేసే పుస్తకాలు వేరు. ఈ పుస్తకం అలాంటిది.
మనకి చరిత్రలో వివక్ష మీద పోరాడిన పెద్ద ఉదంతంగా ఇదే నమోదై ఉంది. క్రీస్తుశకం 71 వ సంవత్సరంలో స్పార్టకస్ అనే ఒక గ్లాడియేటర్ బానిసత్వాన్నీ పోగొట్టడానికి పోరాడే వీరగాధ. సూర్యుడు అస్తమించని రోమన్ సామ్రాజ్యానికి ఎదురు నిలబడ్డ బానిసల పోరాటం ఇది. ఈ పోరాట స్ఫూర్తి చదివే మనల్ని రక్తం మరిగేలా చేస్తుంది. లోలోపల మన చుట్టూ ఉన్న సమాజపు వివక్షలను బద్దలుకొట్టాలన్న కాంక్ష బయలుదేరుతుంది.
ఒక మనిషి మరొకరి వినోదం కోసం బానిసగా బతికి, రక్తం చిందించి చావాల్సిన ఆటవిక సంస్కతినీ ప్రశ్నించే పుస్తకం ఇది. అంతటి ఘనత వహించిన రోమన్ సామ్రాజ్యం బానిసల రక్తమాంసాలతో ఏర్పడినదని, దాని ఘనతను చీకొట్టే జ్ఞానం ఇచ్చే పుస్తకం ఇది. ఈరోజు హక్కుల కోసం నిలబడే వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లలో వేస్తుంటే, రాజ్యం ఇప్పటికీ ఏమి మారలేదని, ఆ దుర్మార్గాలని ప్రశ్నించే స్ఫూర్తిని ఇచ్చే పుస్తకం ఇది.
ఆనాటి రోమన్ సామ్రాజ్యంలో బానిసలు ఏ హక్కులు లేని వాళ్ళు. ఇతర వర్గాలకు వీళ్ళు ఆట బొమ్మలు. స్త్రీలు లైంగికంగా వేధింపుకు గురైన బానిసత్వం అయితే. పురుషులు గనుల్లోను, పంట పొలాల్లో, నగరపు నిర్మాణంలో, ఇలా కలోజియమ్స్ లో రక్తం చిందించడానికి పనికొచ్చే గ్లాడియేటర్ లు గానూ బతుకుతారు. సంతల్లో బానిసలని అమ్మడం, కొనడం ఆనాటి రోమన్ కల్చర్ లో భాగం. ప్రతి భూస్వామి దగ్గర కొందరు బానిసలు ఉండటం అప్పటి స్టేటస్ సింబల్.
ట్రేస్ అన్న ఊరికి చెందిన స్పార్టకస్ చిన్నప్పుడు దేవదారు వనాల్లో గొర్రెలు కాసేవాడు. అతని తండ్రి, తాతలు బానిసలు. తర్వాత అతన్ని బంగారుగనులలో పనికి తీసుకొచ్చారు. ఇక్కడ బానిసకూలీలు రోజుకు ఒక పూట తిండితో వెలుతురు కూడా లేని దుర్భర స్థితిలో పని చేస్తుంటారు. ఒక వ్యాపారి అతన్ని కొని గ్లాడియేటర్ గా పెట్టాడు. స్పార్టకస్ తన సహచరులతో పోరాడాల్సి వచ్చినప్పుడు కుమిలిపోయాడు. మైదానంలో చంపాల్సిన వాడితో స్నేహం చేసి ప్రేమ తత్వాన్ని చాటాడు.
జర్మన్ అడవుల్లో నుంచి పట్టుకొచ్చిన వరీనియాను బానిస వ్యాపారి ‘నీకోసం తెచ్చా’నంటూ స్పార్టకస్ ను అప్పగిస్తాడు. అందమైన ఆమెను వ్యాపారి వివస్త్రను చేసినా ఆమె చలించదు. ఆ మనస్తత్వానికే ఆమెను ప్రేమిస్తాడు స్పార్టకస్. అతను ఎప్పుడు చనిపోతాడా అని భయంతో ఉన్న ఆమెకు, ‘బతికే అవకాశం ఉంటే ఇద్దరం బతుకుతాము. జీవించే క్షణాల కోసం ప్రయత్నిద్దాం’ అని చెబుతాడు. జీవితం యొక్క లక్ష్యం జీవించడం అని తెలియజేస్తాడు ఈ నవలతో. స్పార్టకస్ ఇక్కడ ఒక గొప్ప తాత్వికుడిగా కనపడతాడు.
క్రేక్సెస్ అనే అనుభవముడైన గ్లాడియేటర్ అతనితో.. ”ఇంతకు ముందు కూడా తిరుగుబాటు పోరాటాలు జరిగాయి” అని చెబితే, దాన్నుంచి స్ఫూర్తి పొంది, కొంత మంది ఆచరులతో కలిసి తప్పించుకున్నాడు. తనతో వచ్చే ప్రతి బానిసను కలుపుకున్నాడు స్పార్టకస్. అలా ఒక సైన్యాన్ని తయారు చేశాడు. రోమన్ అధికారులు 6000 మంది సైన్యాన్ని పంపిస్తే, వాళ్లని తుక్కుతుక్కు చేశాడు. స్పార్టకస్ గెరిల్లా వార్ స్టాటజీని తీసుకొచ్చాడు. అతని దెబ్బకి చాలామంది అధికారులు పారిపోయారు. కానీ రోమన్ సైన్యం ముందు స్పార్టక సైన్యం చిన్నది కావడంతో నిలబడలేకపోయింది. తన సహచరుడు క్రేక్సస్ ఆ పోరాటంలో చనిపోవడంతో కుంగిపోయాడు. చివరికి అతని సైన్యం ఓడిపోయి ఆ పోరాటం చరిత్ర శిథిలాల్లో కలిసిపోయి ఉండొచ్చు. అతని భార్య మళ్ళీ బానిసగా మారి ఉండొచ్చు. కానీ ఆ స్పూర్తి మాత్రం తరతరాలు నిలిచిఉంది. బ్రతకడం కోసం చావటానికి కూడా వెనుకాడద్దు అని చెప్పే పోరాటం ఇది.
జీవితం మీద ప్రేమను నేర్పుతాడు స్పార్టకస్. రోమన్ అధికారులు నగరపు శివారులలో దాదాపు 6000 మంది సైన్యాన్ని సిలువ వేసి కొన ఊపిరితో వదిలేస్తే, ఆ బాధను భరిస్తూ, రక్తం ధారగా కారుతూ, దాహానికి అల్లల్లాడుతూ ఉండటం, ప్రాణం కొంచెం కొంచెం పోవడం చూస్తే కళ్ళు చమరుస్తాయి. ఒక్కొక్క పేరా చదువుతూ ఉంటే చావుకు ఎదురొడ్డి నిలబడిన వాళ్ళను చూసి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. కష్టానికి ఎదురు నిలబడడం ఎలాగో నేర్పిన సంఘటనలు అవి.
ఇది చదివాక మన దేశంలో కుల వివక్ష ను స్పార్టకస్ లాగా కత్తితో ఖండించాలి అనిపించక మానదు. చదివినప్పుడు నిచ్చెన మెట్ల వ్యవస్థగా, వివక్షల సమాజంగా ఉన్న మన సమాజం తీరు గుర్తొచ్చి ఈజీగా ఐడెంటిఫై అవుతాము. బహుశా ఈ స్ఫూర్తి వల్లే కావచ్చు, మల్లదాసు అనే చారిత్రక కథను నా బొంబాయి పొట్టేలు పుస్తకంలో రాశాను.
ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ కూడా ఉందని తెలిసి సిరీస్ మొత్తం ఎంతో ఇష్టంగా చూశా. అప్పుడు కూడా నేను చదివి ఊహించుకున్న పాత్రలకు నిజరూపం కళ్ళ ముందే ఉన్నట్టుగా అనిపించింది. ఇందులో రోమన్ తాత్వికుడు సిసిరో పాత్ర ఆకర్షిస్తుంది. సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ సిద్ధాంతాలు మార్చుకునే ఆ పాత్ర ఈరోజు ఉన్న జనానికి రిలేటబుల్.
వివక్ష గురించి ఇంత స్ఫూర్తివంతమైన, చారిత్రక ఘటన మన చరిత్ర పుస్తకాలు ఎందుకు చెప్పలేదు! ఈమధ్య ఒక వాదన వచ్చింది.. మన గొప్పదనాన్ని మన చరిత్రను దాచేశారు అని. గొప్పదనాల సంగతేమో గాని. స్ఫూర్తినిచ్చే చరిత్రను మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన అకాడమీలు రోమన్ సామ్రాజ్య విస్తరణ గురించి చెప్పాయి గాని. ఈ సమానత్వపు సిద్ధాంతాన్ని గురించి, ఇలాంటి చారిత్రక ఘటనల ద్వారా చెప్పకపోవడం బాధాకరం. బహుశా ఆ కొలోనియల్ మెంటాలిటీ ఇంకా ఉందేమో. ఇక నుంచి అయినా మన ఎడ్యుకేషన్లో వీటిని చేర్చితే బాగుంటుంది. స్పార్టకస్ నవల ప్రతి ఒక్కరూ చదవాల్సినదే. జీవితం విలువ తెలియాలంటే చదవాలి. ఎదిరించి పోరాడటం తెలియాలంటే చదవాలి.
– చరణ్ పరిమి
సిలువ మీద స్పార్టకస్.. అతని నెత్తురులో తాత్విక ధార!
- Advertisement -
- Advertisement -