నవతెలంగాణ-కాగజ్‌నగర్
బకాయి పడ్డ వేతనాల చెల్లింపు, పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు గురువారం నుండే సమ్మె చేపడుతుండగా రెండో రోజైన శుక్రవారం స్థానిక రాజీవ్ చౌరస్తాలో కార్మికులు బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనుబంధ మున్సిపల్ కార్మిక యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు శంకర్, సంజీవ్ మాట్లాడుతూ నాలుగు నెలులగా ఎన్‌ఎంఆర్ కార్మికులకు, మూడు నెలలుగా కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదన్నారు. రూ. 2 కోట్ల వరకు పీఎఫ్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల ఇద్దరు కార్మికులు చనిపోతే వారికి ఇప్పటి వరకు నయా పైసా కూడా చెల్లించలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌తో పాటు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని, పాలకవర్గాన్ని నిలదీస్తే తమను పనిలో నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ముంజం ఆనంద్‌కుమార్, నాయకులు మల్లేష్, రమేష్, మధు, శేఖర్, భూమయ్య, సుధాకర్, తిరుపతి, శంకరమ్మ, శ్యామల పాల్గొన్నారు.