– రుణమాఫీపై స్పష్టమైన ఆదేశాలివ్వాలి : మాజీ మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతుల రుణాలకు సంబంధించి గతేడాది డిసెంబర్ నుంచి 7 నెలల వడ్డీని ప్రభుత్వమే భరించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరారు. శుక్రవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు స్పందిం చారు. ఏడు నెలల వడ్డీ చెల్లించాకే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తుం డటంతో రైతులు కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల వేధింపులను ఎదుర్కొన్న ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి కరీం నగర్ జిల్లా లకు చెందిన రైతులు తనకు చేసిన విజ్ఞప్తులను గుర్తుచేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఢిల్లీ కాంగ్రెస్ నిజమా? లేక గల్లీ కాంగ్రెస్ నిజమా?
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరామ్ రమేశ్ విమర్శించిన పీఎం ఫసల్ బీమా యోజనకు సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచి అమలు చేశారని హరీశ్ రావు విమర్శించారు.ఆదానీకి బీజేపీ దోచిపెడుతున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటే, అదే అదానీతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు వేల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. ఢిల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా? తెలంగాణ గల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా? స్పష్టతనివ్వాలని కోరారు.