సినారె సినిమారే

‘మాట పాట నాకు రెండు కళ్లు’ అని ప్రకటించిన మహాకవి డా||సి.నారాయణరెడ్డి. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక సమున్నత శిఖరంలా నిలిచిన మహోన్నత కవి. ‘విశ్వంభర’తో తెలుగు కవితను ‘జ్ఞానపీఠ’మెక్కించిన సినారె కరీంనగర్‌ జిల్లా హనుమాజీపేటలో 1931 జూలై 29 న సింగిరెడ్డి బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు జన్మించారు. రాసిందల్లా కావ్యంగా, పలికిందల్లా పాటగా అందించిన ఘనాపాటి ఆయన.
ఆయన రాసిన నాగార్జునసాగరం, కర్పూర వసంతరాయలు వంటి గేయకావ్యాలను ఆకాశవాణి ద్వారా విన్న ఎన్‌.టి.రామారావు తాను నిర్మిస్తున్న ‘కలిసివుంటే కలదు సుఖం’ (1961) సినిమాకు ఒక పాట రాయవలసిందిగా ఆహ్వానించారు. రాస్తే ఒక సినిమాకు మొత్తం పాటలు రాసి సినీగీతరచయితగా ప్రస్థానం ప్రారంభిస్తాను. లేకుంటే లేదు అని సినారె సున్నితంగా తోసి పుచ్చారు. ఆ తరువాత నిర్మించిన ‘గులేబకావళి కథ’ (1962) చిత్రంలో మొత్తం 10 పాటలు రాయవలసిందిగా ఆహ్వానించారు ఎన్‌.టి.రామారావు. మొదటి చిత్రంతోనే ప్రజల హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరచుకున్నారు సినారె. ఎన్నో గేయకావ్యాలు రాసిన నారాయణరెడ్డికి సినిమా పాటల రచన అవలీలగా సాగింది. ప్రణయం, ప్రబోధం, జానపదం, భక్తి, వినోదం, విషాదం ఇలా అన్ని రకాల వస్తువులతో అద్భుతమైన భావాలతో కూడిన పాటలను వెండితెరపై వెలిగించాడు. సినారె రాసిన అన్ని సినిమా పాటలను విశ్లేషించడం అంటే మహా సముద్రాన్ని మధించడమే. కావున కేవలం కొన్ని గీతాల గురించి ముచ్చటించుకుందాం.
‘రమణీయమైన కల్పనకు లాలిత్యమైన శబ్ద భావ సమ్మేళనం తోడై దాని స్పర్శ అందంగా కన్పిస్తే అది కవితాత్మకత’. అలాంటి కవితాత్మ సినారె సినిమా పాటల్లో అరవిందంలా దర్శనమిస్తుంది.
మచ్చుకు- ఆయన రాసిన మొదటిపాటనే నిదర్శనంగా తీసుకోవచ్చు.
‘నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని/ కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి’ (గులేబకావళి కథ-1962) అనే పాటలో ప్రేయసీ ప్రియుల హృదయాల్లోని ప్రణయాన్ని అత్యంత సున్నితంగా ఆవిష్కరించారు.
‘తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన/ పూలదండవోలె కర్పూర కళికవోలె’ అంటూ వికసించిన ప్రేమబంధాన్ని ఎంతో లాలిత్యంగా చెప్పారు. ప్రియుని పాదాల చెంత తాను పూలదండలాగా ఒదిగి ఉండడం, కర్పూర కళికలాగా కరిగిపోవడమనేది ప్రియునిపై ప్రేయసికున్న అనురాగ పారవశ్యాన్ని చాటుతోంది. నిజానికి ఇది సినారె రాసిన మొదటిపాట కాదు. ఇదే సినిమాలోని ‘కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై’ అనేది ఆయన రాసిన మొదటిపాట. కాని ”నన్ను దోచుకొందువటే” పాట ముందుగా విడుదలైంది.
‘పూజాఫలం’ (1964) సినిమాలో రాసిన.. ”పగలే వెన్నెల జగమే ఊయల/ కదలే ఊహలకే కన్నులుంటే’ అంటూ.. ‘నింగిలోన చందమామ తొంగి చూచె/ నీటిలోన కలువభామ పొంగి పూచె” అన్నపుడు సమత, లయ, భావాభివ్యక్తి నిండుగా దర్శనమిస్తాయి. ఓహో అనిపిస్తాయి. మన ఎదలను అలరిస్తాయి. ఈ పాటలోని విరిసిపోదా, కురిసిపోదా, నిలిచిపోదా అనే పదాలు గజల్‌ లక్షణాలు కలిగిన రదీఫ్‌గా కన్పిస్తాయి. ప్రకృతిలోని అందానికి పరవశించే మనసున్న రసజ్ఞుడికి అణువణువున అందాలు వెల్లువెత్తి కనిపిస్తాయి. ఆనందంతో హృదయం ఉప్పొంగిపోతుంది. అంతటా అమృతం కురిసిపోతూ ప్రశాంతత దర్శనమిస్తుంది. ఆ ఆనందానుభూతిని ఈ పాటలో ఎంతో గొప్పగా వివరించారు.
సన్నివేశానికి ఒదిగేలా పాట రాయడంలో సినారె సిద్ధహస్తులు. ఆ సన్నివేశానికి తగిన పదబంధాలు వరసకట్టి వచ్చి వాలిపోతాయి. అందుకు ‘ఆత్మబంధువు’ (1962) సినిమాలోని ఈ పాటే నిదర్శనం. ”చదువురానివాడవని దిగులు చెందకు?/ మనిషి మదిలోన మమతలేని చదువులెందుకు?/ మంచువంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు?” అనే పాట మనిషి తన హృదయాన్ని తానే ఆవిష్కరించుకుని సరిదిద్దుకునేలా చేస్తుంది. చదువు కన్నా మమత, మానవత్వం మిన్న అనే హితబోధనందిస్తుంది. మంచులాగా, మల్లెలాగా తెల్లని మనసుతో బతకమన్న సందేశం ఈ పాటలో కనబడుతుంది.
‘శ్రీకృష్ణపాండవీయం’ (1966) సినిమాలోని.. ‘ఛాంగురే బంగారు రాజా!/ ఛాంగు ఛాంగురే బంగారు రాజా!/ మజ్జారే మగరేడా!/ మత్తైన వగకాడా!’ అనే పాట నారాయణరెడ్డికి గల గ్రాంథిక భాషాకౌశలాన్ని, విశేష ప్రతిభా సముద్దీప్తిని తెలియజేస్తుంది. ఈ పాటలోని మచ్చెకంటి చూపు, మజ్జారే, అయ్యారే, ఛాంగురే వంటి పదాల్లో గ్రాంథిక భాషా సౌందర్యం గుబాళిస్తుంది సహస్ర కిరణాలుగా.
నారాయణరెడ్డి పాటలో మణిదీపం ఉంది. ఆ మణిదీపపు కాంతులలో ఆయన కవితాత్మకత రూపం ఎంతో అందంగా దర్శనమిస్తుంది. మచ్చుకు- ‘ఏకవీర'(1969) లోని.. ‘తోటలో నారాజు తొంగి చూసెను నాడు/ నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు’ పాటలో నవ్వులను నవపారిజాతాలుగా, రసరమ్యగీతాలుగా భావించడం ఒక వినూత్నమైన ఊహ. అయితే ఈ పాట సినిమా కోసం రాసింది కాదు. సినారె రాసిన ‘రామప్ప’ నత్యరూపకంలోని గేయమిది. ఇంకా.. ‘అమరశిల్పిజక్కన'(1964) సినిమాలో జక్కన శిల్పి శిలల్లోని అమృతకళలను చూసి పరవశించి పాడే.. ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో/ ఈ బండల మాటున ఏ గుండెలు మోగెనో’ అనే పాట, ‘లక్షాధికారి’ (1964) సినిమాలో ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు పులకించి పాడుకునే.. ”మబ్బులో ఏముంది?/ నా మనసులో ఏముంది?” పాట సినారె రాసిన రామప్ప లోని గేయాలే. వీటినే తరువాత సినిమాల్లో వాడుకోవడం జరిగింది.
‘రాముడు భీముడు’ (1964) సినిమాలోని.. ”తెలిసిందిలే తెలిసిందిలే/ నెలరాజా నీ రూపు తెలిసిందిలే” అనే పాటలో ప్రేమికుల మనసుల్లో పుట్టిన ప్రేమను తమంతట తాము ఆవిష్కరించుకుని, అర్థం చేసుకునే తీరును హృదయంగమంగా చెబుతారు.
‘బంగారుగాజులు’ (1968) సినిమా కోసం రాసిన.. ”అన్నయ్య సన్నిధి/ అదే నాకు పెన్నిధి/ కనిపించని దైవమే/ ఆ కనులలోన ఉన్నది” అనే పాటలో అన్నాచెల్లెళ్ళ అనురాగాన్ని ఆవిష్కరించారు. ఒక తీగ పువ్వులై, ఒక గూటి దివ్వెలై ఆత్మీయంగా మెదిలే అన్నాచెల్లెళ్ళ జీవితాన్ని ఎంతో మధురంగా వివరించారు.
‘మట్టిలో మాణిక్యం’ (1971) సినిమాలోని.. ”రిమ్‌ జిమ్‌ రిమ్‌ జిమ్‌ హైదరాబాద్‌/ రిక్షావాలా జిందాబాద్‌/ మూడు చక్రములు గిరగిర తిరిగితే/ మోటర్‌ కారు బలాదూర్‌” పాటలో శ్రామికుడి కష్టాన్ని, అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తూనే హైదరాబాద్‌ చారిత్రక విశేషాల్ని, ప్రదేశాల్ని తెలియజేశారు.
‘కోడలు దిద్దిన కాపురం’ (1970) సినిమాలో.. ‘నీ ధర్మం నీ సంఘం నీ దేశం/ నువు మరవద్దు/ జాతిని నడిపి నీతిని నిలిపే/ మహనీయులనే మరవద్దు” అనే పాటలో ప్రతీ భారతీయుడు తన జాతిని, నీతిని మరిచిపోకుండా సంస్కారంగా నడుచుకోవాలని, దేశస్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహనీయులను సంస్మరించుకోవాలని ప్రబోధిస్తున్నారు సినారె.
‘బాలమిత్రులకథ’ (1972)లో రాసిన.. ‘గున్నమామిడి కొమ్మ మీద/ గూళ్ళు రెండున్నాయి/ ఒక గూటిలోన రామచిలకుంది/ ఒక గూటిలోన కోయిలుంది” పాటలో స్నేహం విలువను చాటారు. తరతమభేదాలు లేనిదే స్నేహమన్న సందేశాన్నిచ్చాడీ పాటలో..
‘నిప్పులాంటి మనిషి’ (1974) సినిమాలోని ‘స్నేహమేరా జీవితం/ స్నేహమేరా శాశ్వతం’ అనే పాటలో కూడా స్నేహం విలువను, చలువను గూర్చి వివరించారు.
‘అల్లూరి సీతారామరాజు’ (1974)లోని.. ”వస్తాడు నారాజు ఈరోజు/ రానే వస్తాడు నెలరాజు ఈరోజు” అనే పాటలో ప్రియుని రాకకై ఎదురుచూస్తూ, నిదురకాస్తూ వేయి కళ్ళతో వేచియున్న ప్రేయసి హృదయంలోని కోటివలపుల తీయదనాన్ని ఎరుకపరుస్తారు.
‘ముత్యాలముగ్గు’ (1975) లోని.. ”గోగులుపూచె గోగులుపూచె ఓ లచ్చగుమ్మాడి/ గోగులు దులిపేవారెవరెమ్మా ఓ లచ్చగుమ్మాడి” అనే పాట జానపదశైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది జానపదుల పల్లవే.. ఆ పల్లవికి కావ్యశైలిలో ఒదిగే పదబంధాలను మృదుమధురంగా అద్దారు. ‘పొద్దుపొడిచే పొద్దుపొడిచే, పుత్తడి వెలుగులు కొత్తమెరిసే’ అనే పదబంధాలు సినారె కలంలోని వాడిని, కవితాత్మకనాడిని తెలియజేస్తాయి.
సంస్కృత సుదీర్ఘ సమాసాలతో, ప్రౌఢగతిలో గేయకావ్యాలు రాసిన నారాయణరెడ్డి సినిమాల్లో కూడా సందర్భోచితంగా సంస్కృత పదబంధాలతో పాటలు రాసి సంస్కృత భాషా సౌందర్యాన్ని పెంచారు.
‘చెల్లెలి కాపురం’ (1971) లోని.. ‘ఫాలనేత్ర సంప్రభవత్‌ జ్వాలలు/ ప్రసవశరుని దహియించగా/ పతిని కోలుపడి రతీదేవి/ దు:ఖిత మతియై రోదించగా/ హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్‌ / ప్రమథగణము కనిపించగా/ ప్రమధనాదకర పంకజ భాంకత/ ఢమరుధ్వని వినిపించగా….’ (చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన) అనే పాటలో శివుని విలయతాండవాకృతిని, ఆవేశాన్ని, గరళకంఠుని లీలామానుష రూపాన్ని కవితాత్మకంగా చెప్పారు. సినిమా సన్నివేశపరంగా చూస్తే.. ఈ కవితకు తగిన అభినయాన్ని చేయలేక నాట్యగత్తె ఓడిపోయి కవి పాదాలముందు వాలిపోవడమనేది కవికున్న కవితాశక్తిని చాటుతుంది. సినారెకున్న సంస్కృతభాషాధురీణతను వేనోళ్ళ చాటుతోంది.
అలాగే.. ‘జయసుధ’ (1980) సినిమాలో రాసిన.. ‘తరళ తరళ నీహార యవనికల/ మెరిసే సూర్యకళిక/ మదుల మదుల నవపవన/ వీచికల కదిలే మదన లతిక’. (ప్రణయకావ్యమున) అనే పాట ప్రేయసి మనోహర రూపాన్ని మంచు తెరల మాటున మెరిసే సూర్యకాంతితోను, సున్నితమైన గాలితరగల మాటున ఊగే పూలతీగతోను పోల్చిన వైనం అద్భుతం.
‘స్వాతికిరణం’ (1992) లో.. ”వేద వేదాంత వన వాసినీ/ పూర్ణ శశి హాసినీ” అంటూ వాగ్దేవిని వేదాల వనాల్లో నివసించే దేవిగా, నిండు చంద్రబింబమై ఆమె ముఖం నవ్వుతోందని ఎంతో రమణీయంగా అభివర్ణించారు.
‘మంగమ్మ గారి మనవడు’ (1984) సినిమాలో సినారె రాసిన ఈ పాట కుర్రకారుని హుషారెత్తించి ఈలలు వేయిస్తుంది.. గోలలు చేయిస్తుంది.. ”దంచవే మేనత్త కూతురా/ వడ్లు దంచవే నా గుండెలదరా/ దంచు దంచు బాగా దంచు” పాటలో బావామరదళ్ళ ఘాటుసరసాన్ని ఎంతో నీటుగా చెప్పాడు. ద్వంద్వర్థాల మాటున అశ్లీల శృంగారం తొంగి చూస్తున్న వైనం కూడా ఈ పాటలో కనబడుతుంది. సినిమా నాడి తెలిసిన కవి కనుక ఇలాంటి పాటలు రాయగలిగాడు.. జనాల్ని మెప్పించగలిగాడు.
‘ఓసెరు రాములమ్మ’ (1997) సినిమాలో.. ”ముత్యాలరెమ్మా మురిపాలకొమ్మా/ పున్నమిబొమ్మా పుత్తడిగుమ్మా/ ఏం సూపులోయమ్మా యేగుసుక్కలేనమ్మా/ సిరినవ్వులోయమ్మా సెంద్రవంకలేనమ్మా’ అంటూ తెలంగాణ యాసలో అద్భుతంగా రాశారు. పల్లెటూరి పిల్లలోని గడుసుదనాన్ని, సున్నితత్వాన్ని గొప్పగా ఆవిష్కరించారు. ఆమె చూపులను వేగుచుక్కలుగా, ఆమె సిరినవ్వులను చంద్రవంకలుగా భావించారు. ఈ పాటలో వాడిన పంక, దొర, దొరసాని, బాంచెన్‌, కాల్మొక్త, దేవిడి, తల్లోని నాలుక వంటి పదబంధాలు, జాతీయాలు సినారెకున్న మాండలిక కౌశలాన్ని చాటి చెబుతాయి.
‘అరుంధతి’ (2009) సినిమాలోని ‘జేజమ్మా మాయమ్మా’ అనే పాట కూడా గొప్ప భావుకత్వంతో కనిపిస్తుంది.
‘మనసైనోడు’ (2018) సినిమాలో రాసిన.. ”జయజయహే భరతావని పావని/ సద్గుణగణసముపేతా” అనే పాట.. సినారె రాసిన చివరి పాట.. ఇది సినారెకున్న దేశభక్తిని తెలియజేస్తుంది. ఈ పాటలో ఝూన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, గాంధీ లాంటి మహనీయులను తలచుకుంటూ వారి త్యాగశీలతను కొనియాడుతారు.
ఇవే కాక.. ‘ప్రేమించు’ (2001) సినిమాలో రాసిన అమ్మ ప్రేమను చాటి చెప్పే ”కంటేనే అమ్మ అని అంటే ఎలా?”, ‘సీతయ్య’ (2003) సినిమాలో రాయలసీమ పౌరుషాన్ని చాటి చెప్పే ”ఇదిగో రాయలసీమ గడ్డ దీని కథ తెలుసుకో తెలుగుబిడ్డ” పాటలకు నంది పురస్కారాలందుకున్నారు. ‘స్వాతిముత్యం’ (1986) సినిమాలోని ‘వటపత్రశాయికి వరహాల లాలీ’, ‘సూత్రధారులు'(1989) సినిమాలోని ‘జోలా జోలలమ్మ జోలా జేజేలా జోలా’ అనే పాటలతో సినీ ప్రేక్షకులను ఉయ్యాలలూపి మైమరపింపజేసి నిదురపుచ్చారు. దాదాపు 3500 కు పైగా సినిమాపాటలను రాశారు నారాయణరెడ్డి. ఆయన గీతాలెన్నో మనోగగనంలో దివ్యతారలుగా దర్శనమిస్తాయి. సినిమాపాటల్లో ఎన్నో ప్రయోగాలు చేసి నారాయణరెడ్డి కలం విశ్వరూపమై విన్యాసం చేసింది. మహాకవి డా||సి.నారాయణరెడ్డి భౌతికంగా కీర్తిశేషుడైనా, ఇలాంటి గీతాల వల్ల కీర్తివిశేషుడయ్యారు.
(జూలై 29 న డా.సి.నారాయణరెడ్డి
93వ జయంతి సందర్భంగా..)
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]
సినీగేయరచయిత, 6309873682

Spread the love